కాకినాడ రూరల్ నుంచి Pawan Kalyan పోటీ?.. ఆ నాలుగు చోట్లపై కన్ను
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి మాట్లాడుకోవడంతో గోదావరి జిల్లాలో పెద్ద చర్చగా మారింది..
- ఆ సీట్లే కావాలని పట్టు
- పవన్, చంద్రబాబు కలయికతో గోదావరి జిల్లాల్లో జనసేన లెక్కలు
- నియోజకవర్గాల వారీగా విశ్లేషణ
దిశ, (ఉభయ గోదావరి): జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి మాట్లాడుకోవడంతో గోదావరి జిల్లాలో పెద్ద చర్చగా మారింది. రెండు పార్టీల ఏకమవ్వడం ఖాయం అనే అంచనాకు వచ్చాయి. అంతేగాక బీజేపీతో కలిసి మహాకూటమిగా ఏర్పడనున్నాయనే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో జిల్లాలో రాజకీయ కాక మరింతగా పెరిగింది. ముఖ్యంగా జనసేన నేతల్లో వేడి మరింతగా పుంజుకుంది. ఆశావహులు మాత్రం జనసేనకు సీట్లు ఎక్కడ అడగాలి, ఎక్కడయితే ఎటువంటి ప్రభావం ఉంటుందీ అనే లెక్కల్లో మునిగి తేలుతున్నారు. క్షేత్ర స్థాయిలో లెక్కలు వేసుకొని వాటిని అధిష్టానికి పంపించే ఆలోచనలో ఉన్నారు. అంతేగాక కాకినాడ రూరల్ నుంచి అదినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే కూడా ప్రచారం సాగుతోంది. దీంతో జనసైనికులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో పవన్ పోటీపై పెద్ద చర్చగా మారింది. మొన్నటి దాకా పిఠాపురం నుంచే పవన్ పోటీ అనుకున్నా.. ఆ సీన్ కాకినాడ రూరల్‌కు మారింది. జిల్లా కేంద్రమైన కాకినాడకు కూత వేటు దూరంలోనే రూరల్ కూడా ఉండటంతో ఇక్కడే పవన్ పోటీ చేస్తే ఆ ప్రభావం అంతా జిల్లా మొత్తం మీద పడుతుందనే నమ్మకం ఉంది. దీంతో జనసేనకు మంచి ఫలితం ఉంటుందని, పోటీ చేసిన స్థానాల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే నమ్మకంలో ఉన్నారు.
కాకినాడ రూరల్ నుంచి పవన్ పోటీ?
కాకినాడ రూరల్ నుంచి అదినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జనసేన ఇంఛార్జిగా పంతం నానాజీ ఉన్నారు. టీడీపీ నుంచి మాజీ శాసన సభ్యులు పిల్ల అనంత లక్ష్మి, మాజీ యంపీపీ పేరాబత్తుల రాజశేఖర్, పెంకే శ్రీనివాస బాబా ఉన్నారు. అయితే నియోజకర్గంలో సగం పైచిలుకు కాపులున్నారు. టీడీపీకు ఇక్కడ సరైన నాయకుడు లేడనే చెప్పాలి. 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' అంటూ ఇంటింటా తిరుగుతున్న మాజీ శాసన సభ్యులు పిల్లి అనంత లక్ష్మి , సత్యనారాయణ మూర్తికు సరైన ఆదరణ లేదు. ఇక మిగతా వారిది కూడా అదే పరిస్థితి. దీనికి తోడు గ్రూపు విభేదాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా మిత్ర పక్షంలో భాగంగా ఈ సీటు జనసేనకు వదిలేస్తే బెటర్ అనే అంచనాకు వచ్చినట్లు సమాచారం. దీనికితో పవన్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేయడానికి ఉత్సాహం కనపబర్చడంతో టీడీపీకు లైన్ క్లీర్ అయినట్లుగా చెప్పవచ్చును. దీంతో పవన్ ఖచ్చితంగా ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ముందు పిఠాపురంలో పవన్ పోటీ అనుకున్నారు. కానీ అక్కడ టీడీపీలో అంతగా కుమ్ములాటలు లేవు. పార్టీ అధికార ప్రతినిధి అయిన వర్మకు లైన్ క్లీర్‌గానే ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో రూరల్‌లో పోటీ చేస్తే అటు జనసేన, ఇటు టీడీపీకు కూడా ఫలితం ఉంటుందనే అభిప్రాయంలో ఇరుపార్టీల వారున్నారు.
కోనసీమ కేంద్రం అమలాపురం మీద కూడా పట్టు
కోనసీమ ప్రధాన కేంద్రమైన అమలాపురం సీటు కూడా కావాలని జనసేన పట్టు పడుతుంది. స్థానికంగా వైసీపీ నుంచి మంత్రి విశ్వరూప్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి మాజీ శాసన సభ్యులు అయితాబత్తుల ఆనంద రావు ఇంఛార్జిగా ఉన్నారు. జనసేన నుంచి శెట్టిబత్తుల రాజశేఖర్, డియంఆర్ శేఖర్ ఉన్నారు. వీరిద్దరూ కూడా పార్టీలో చురుకుగా ఉన్నా వర్గ పోరు కొనసాగుతుంది. అయితే ఇటీవల కోనసీమ అల్లర్ల నేపథ్యంలో కాపులు, బీసీలు ఏకమయ్యారు. వీరు అధికార పార్టీకి దూరంగా ఉన్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇక్కడి సీటు పై టీడీపీ, జనసేన పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇందులో భాగంగానే జనసేన ఇక్కడి సీటు కావాలని పట్టు బడుతుంది. రాజబాబు, శేఖర్ నడుమ సరైన సయోధ్య లేకపోతే దళితుల్లోనే మంచి చదువుకున్న మహిళకు ఇక్కడి స్థానం ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో జనసేన ఉంది. ఇరు పార్టీల నడుమ ఒప్పందం కుదిరి అమలాపురం జనసేనకు కేటాయిస్తే స్థానికంగా విద్యావంతురాలైన మహిళకు ఇక్కడి స్థానం ఇవ్వాలని ఆలోచనలో పార్టీ ఉంది.
రాజోలు మీద కూడా జనసేనకు నమ్మకం
గత ఎన్నికల్లో రాజోలు సీటును జనసేన కైవసం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటామనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ జనసేన తరుపున గెలిచిన రాపాక వరప్రసాదరావు వైకాపాలో చేరారు. అయితే మొన్నటి దాకా వైసీపీలో ఇంఛార్జిగా ఉన్న బొంతు రాజేశ్వర్రావు మాత్రం జనసేనలో చేరారు. ఈసారి మిత్రపక్షంలో ఇక్కడి సీటు జనసేనకు అడగాలనే యోచనలో ఉన్నారు. రాజోలు రిజర్వుడు నియోజకవర్గం. వైసీపీ తరుపున సిట్టింగ్ శాసన సభ్యులు రాపాక వరప్రసాదరావు ఉండగా టీడీపీ తరుపున మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరారావు , జనసేన తరుపున బొంతు రాజేశ్వర్రావు ఉన్నారు. టీడీపీ విషయానికొస్తే మాజీ మంత్రి గొల్లపల్లికి స్థానికేతరుడనే ముద్ర ఉంది. 2014 గాలిలో ఈయన నెగ్గినా, తాజాగా ఇతనికి కేడర్ దూరం అవుతుంది. అయితే జనసేనకు ఇక్కడ అవకాశం ఇస్తే కాపులు, దళితులు, బీసీలు ఏకమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో గెలుపు సునాయసనం అనే నమ్మకంతో పార్టీ ఉంది. అయితే ఆది నుంచి రాజోలు తెదేపాకు కంచుకోట అవ్వడం వల్ల అదినేత చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే
రాజానగరం జనసేనకు ఇస్తేనే సేఫ్
ప్రస్తుతం రాజానగరం స్థానంలో టీడీపీకు నాయకుడు లేడనే చెప్పాలి. 2014 లో గెలిచిన పెందుర్తి వెంకటేష్ 2019లో ఓడిపోయారు. ఆయన ఓడిపోయిన నాటి నుంచి పార్టీలో చురుకుగా లేరు వాస్తవం చెప్పాలంటే ఆయన అసలు పార్టీలో ఉన్నారో లేడో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఇక్కడ సరైన నాయకుడు కోసం వెతుకులాడుతున్నారు. వైసీపీ నుంచి జక్కంపూడి రాజా శాసన సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే రాజానగరం జనసేనకు ఇచ్చేస్తే టీడీపీ సేప్‌లో ఉంటుందనే ప్రచారం సాగుతుంది. పార్టీ నాయకులు కూడా అదే ఆలోచిస్తున్నారు.
Read more:
పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ కాదని తన తల్లి, అన్నయ్యపై ఒట్టేసి చెప్పగలరా..?