Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి ములాఖత్ తిరస్కరణ.. కారణం ఇదే..!
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నచంద్రబాబును కలిసేందుకు నారా భువనేశ్వరికి జైలు అధికారులు ములాఖత్ తిరస్కరించారు...
దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి చుక్కెదురైంది రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడును కలిసేందుకు భువనేశ్వరి ములాఖత్ కోసం దరఖాస్తు చేశారు. అయితే జైలు అధికారులు ములాఖత్‌ను తిరస్కరించారు. దీంతో అధికారుల తీరుపై నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారానికి మూడు సార్లు కలిసేందుకు అవకాశం ఉన్నప్పటికీ జైలు అధికారులు ములాఖత్ తిరస్కరించడం సరికాదని మండిపడ్డారు. ములాఖత్ వ్యవహారంలో ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు.
అయితే చంద్రబాబును కలిసేందుకు మూడోసారి ములాఖత్ కావాలంటే జైలు అధికారులు తుది నిర్ణయం తీసుకోవాలి. కానీ జైలు సూపరింటెండెంట్ రాహుల్ మూడు రోజలు పాటు సెలవులో ఉన్నారు. ప్రస్తుతం జైలు ఇంచార్జి సూపరింటెండెంట్‌గా కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ పని చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడును నారా భువనేశ్వరి రెండుసార్లు కలవడంతో జైలు అధికారులు మూడో సారి ములాఖత్‌కు అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది.
కాగా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నప్పటి నుంచి భువనేశ్వరి రాజమహేంద్రవరంలోనే ఉన్నారు. కొడుకు నారా లోకేశ్, కోడలు బ్రహ్మణిలు రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. చంద్రబాబు నాయుడుకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో భువనేశ్వరి ఆ కార్యక్రమాలు చూస్తున్నట్లు తెలుస్తోంది.