వారసులకు పదవులు.. మళ్లీ అదే రిపీట్ అవ్వనుందా?

మెట్ల సత్యనారాయణ వారసుడు అయిన రమణ బాబుకు నామినేటడ్ పోస్టు ఇవ్వాలని కోనసీమ నేతలు కోరారు. దీంతో చంద్రబాబు సుముఖం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Update: 2024-10-06 02:58 GMT

దిశ, కోనసీమ ప్రతినిధి: దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి, దివంగత మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు. వీరిద్దరూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పెద్దలుగా చలామణి అయ్యేవారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో వీరు పార్టీ ప్రతిష్టతకు అవిరామ కృషి చేశారు. ఆ రోజుల్లో కోనసీమలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అధ: పాతాళానికి తొక్కి వేయడంలో వీరిద్దరి పాత్ర గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో కోనసీమ జిల్లాను టీడీపీ కంచుకోటగా చేశారు. అంతేకాక పార్టీకి 1995లో వచ్చి న సంక్షోభంలో వీరిద్దరూ చంద్రబాబు వెంట ఉండి పార్టీ మరింతగా బలపడటానికి ముఖ్య కారకులు అయ్యారు. అంతటి క్రేజ్ ఉన్న వీరి మృతి పార్టీ పెద్ద దిక్కు కోల్పోయినట్లే అని చెప్పాలి. అప్పట్లో వీరితో పాటు నిమ్మకాయల చినరాజప్ప ఉన్నా, తాజాగా ఆయన కాకినాడ జిల్లా పెద్దాపురం రాజకీయాలకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో దివంగత స్పీకర్ బాలయోగి కుమారుడికి గత రెండు పర్యాయాలు నుంచి ఎంపీగా సీటు ఇచ్చి టీడీపీ సముచిత స్థానం కల్పించింది. 2019 లో ఓటమి పాలైన బాలయోగి తనయుడు హరీశ్ మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో అమలాపురం ఎంపీగా ఆయన బాలయోగి లేని లోటు తీరుస్తున్నారనే చెప్పాలి. ఇక మిగిలింది దివంగత మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ రావు కుమారుడు మెట్ల రమణ బాబు.. అయితే ఇతని విషయమై పార్టీలో చర్చగా మారింది.

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కోనసీమ ఎమ్మెల్యేలు

కోనసీమ జిల్లాకు చెందిన శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు, బండారు సత్యానందరావు, అయితా బత్తుల ఆనందరావు , మంత్రి వాసంసెట్టి సుభాశ్ వంటి నాయకులు గత గురువారం మంగళగిరిలో చంద్రబాబును కలిశారు. మెట్ల సత్యనారాయణ వారసుడు అయిన రమణ బాబుకు నామినేటడ్ పోస్టు ఇవ్వాలని కోరారు. దీంతో చంద్రబాబు సుముఖం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఆలోచనలో పడ్డ చంద్రబాబు

కోనసీమ జిల్లా శాసన సభ్యులు కలిసిన తర్వాత చంద్రబాబు రమణ బాబు విషయమై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గతంలో మాదిరిగానే బాలయోగి, మెట్ల కాంబినేషన్ మాదిరిగా రమణ బాబునకు కోనసీమ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పడ్డారట. ప్రస్తుతం బాలయోగి తనయుడు హరీష్ ఎంపీగా ఉన్నారు. ఇతనికి తోడుగా రమణబాబుకు నామినేటెడ్ పోస్టు గానీ, పార్టీలో కీలక బాధ్యతలు కానీ అప్పగిస్తే పార్టీకి మరింత మైలేజ్ వస్తుందనే నమ్మకంలో ఉన్నారు. రమణ బాబు, హరీశ్.. వీరిద్దరూ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వివాద రహితుడిగా మంచి పేరుంది. దీంతో హరీశ్‌కు తోడుగా రమణ బాబును కూడా రంగంలోకి దింపితే అటు ఎస్సీ, ఇటు ఓసీ సామాజిక వర్గం నుంచి పార్టీకి మరింత కేడర్ పెరుగుతుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అయితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.


Similar News