AP:‘భయపడకండి ప్రభుత్వం అండగా ఉంటుంది’..మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు
గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వేలేరుపాడు మండలంలో సుమారు 12 గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి.
దిశ, కుక్కునూరు: గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వేలేరుపాడు మండలంలో సుమారు 12 గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆ గ్రామంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌తో కలిసి పరిశీలించి భాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీరికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
మంత్రి మాట్లాడుతూ పరిస్థితులు చాలా దారుణం ఉన్నాయని, బాధితులకు త్రాగు నీరు, భోజనం తప్పనిసరిగా అందించాలని, అలాగే ఆరోగ్య పరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పూర్తిగా ఇల్లు నష్టపోయిన వారి రిపోర్ట్ సిద్ధం చేస్తే, వారికి ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయం అందుతుందని తెలిపారు. ప్రజలు ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని ప్రభుత్వం ఎప్పుడు మీకు తోడు ఉంటుందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.