‘ప్చ్.. టికెట్ రాలే’.. ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ, జనసేన నేతల్లో అసంతృప్తి జ్వాలలు..!

టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటన తర్వాత టీడీపీ, జనసేన పార్టీల నుంచి అసంతృప్త జ్వాలలు తారస్థాయికి చేరాయి.

Update: 2024-02-26 03:37 GMT

దిశ, గోదావరి జిల్లాల ప్రతినిధి: టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటన తర్వాత టీడీపీ, జనసేన పార్టీల నుంచి అసంతృప్త జ్వాలలు తారస్థాయికి చేరాయి. జగ్గంపేట టికెట్ ఆశించిన జనసేన అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర రావుకు ఆశాభంగం కావడంతో నిరాహారదీక్షకు దిగారు. రాజానగరం జనసేన అభ్యర్థి బత్తుల బాలకృష్ణకు ఇవ్వటంతో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చెయ్యి ఎదురైంది. రాజమండ్రి రూరల్ స్థానానికి ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆశిస్తున్నా ఇప్పటివరకు ఖరారు చేయలేదు. ఇప్పటిదాకా ఇరు వర్గాలకు క్లారిటీ లేకుండా చేశారు. దీంతో టీడీపీ సీనియర్‌ బుచ్చయ్య చౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ముమ్మిడివరంలో..

ఇక ముమ్మిడివరంలో టీడీపీ అభ్యర్థిగా దాట్ల బుచ్చిబాబును ప్రకటించడంతో జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పి.గన్నవరం మహాసేన రాజేష్‌కు ఇవ్వంతోఅక్కడ జనసేనతో పాటు టికెట్ అశించిన టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఈ అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. నరసాపురం పార్లమెంట్ పరిధిలో పాలకొల్లు, ఉండి, ఆచంట, తణుకు సీట్లు టీడీపీ అభ్యర్థులకు కేటాయించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరు, చింతలపూడి స్థానాల్ని సైతం టీడీపీకే కేటాయించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పీతల సుజాతకు మొండి చేయి చూపించారు.

చింతలపూడిలో..

చింతలపూడిలో నాన్ లోకల్‌కి టికెట్ కేటాయించడంతో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంగా రోషన్‌కు టికెట్ ఇవ్వడంపై టీడీపీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం, నరసాపురం స్థానాల్లో తొలి జాబితాలో ఎవరికీ చోటు దక్కలేదు. ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేన నేత రెడ్డప్పలనాయుడుకు భంగపాటే ఎదురైంది. ఉండి టికెట్‌పై ఆశకు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు ఆశాభంగం కలిగింది. తణుకు నియోజకవర్గంలో వారాహి యాత్రలో పవన్ మాట ఇచ్చినా విడివాడ రామచంద్ర రావుకు సీటు దక్కలేదు. పాపం తనకే ఎమ్మెల్యే సీటు వస్తుందంటూ ప్రచారం చేసుకున్న విడివాడ రామచంద్ర రావుకు చుక్కెదురైంది.

Also Read..

పెండింగ్ సెగ్మెంట్లపై నేతల ఆశలు.. ఆ ఐదు నియోజకవర్గాల్లో ఉత్కంఠ

Tags:    

Similar News