దిశ ఎఫెక్ట్.. ఏయూ మాజీ వీసీ పై విచారణ
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి వ్యవహారాలపై ఆయన శాఖ నుంచి విచారణ ప్రారంభం కానుంది.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం : ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి వ్యవహారాలపై ఆయన శాఖ నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఆయన పనిచేసే కంప్యూటర్ సైన్స్ విభాగంలో వ్యవహారాలపై నిజ నిర్ధారణకు ఐదుగురు ప్రొఫెసర్లతో కమిటీని నియమిస్తూ వీసీ శశిభూషణరావు ఆదేశాల మేరకు రిజిస్ర్టార్ ఎన్. కిషోర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఏయూ ఆర్స్ట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.నరసింహారావు, ఫార్మాస్యూటికల్ కళాశాల ప్రిన్సిపాల్ జి. గిరిజా శంకర్, ఆర్ అండ్ డీ డీన్ కె. బసవయ్య, ఇంజనీరింగ్ కళాశాల సీ ఎస్, ఎస్ ఈ విభాగం హెడ్ కె. వెంకట్రావు, ఐటీసీఏ హెడ్ కె. నాగేశ్వరరావులతో కూడిన కమిటీ విచారణ జరుపనుంది. సీఎస్‌ఈ , ఐటీ మొదటి సంవత్సరం విద్యార్థుల క్లాస్ వర్క్, పనితీరు, కంప్యూటర్ సైన్స్ విభాగం ఫ్యాకల్టీ అటెండెన్స్ కు సంబంధించిన వ్యవహారాలు, విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్ అంశాలు, ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా కంప్యూటర్ సైన్స్ , జర్నలిజం, ఎకనామిక్స్ విభాగాల వ్యవహారాలపై ఈ కమిటీ విచారణ చేయనుందని రిజిస్ర్టార్ తెలిపారు. ఈ కమిటీ ఆగస్టు 19 వ తేదీ నాటికి సీల్డ్ కవర్‌లో తమ నివేదికను సమర్పించాలని పేర్కొన్నారు.
ప్రసాదరెడ్డి కేంద్రంగానే కమిటీ
వీసీ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ప్రసాదరెడ్డి కంప్యూటర్ సైన్స్ విభాగంలో పాఠాలు చెప్పాలి. అయితే ఆయన జూలై నెలలో పెద్దగా హాజరుకాలేదని, బినామీలతో వచ్చినట్లు సంతకాలు చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఆయన వీసీగా ఉన్న సమయంలో గంట ఆలస్యంగా వచ్చిన ప్రొఫెసర్లనే వేధింపులకు గురిచేశారు. ఇప్పుడు ఆయన తీరిగ్గా మధ్యాహ్నం 12 గంటల తరువాత రావడం క్యాంపస్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పైగా వచ్చిన తర్వాత క్లాసులకు వెళ్లకుండా తన వర్గీయులతో సమావేశాలు జరుపుతూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని కమిటీని నియమించారు.