హనుమంత వాహనంపై తిరుమల శ్రీవారి దర్శనం

తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి

Update: 2024-10-09 05:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు వస్తున్న భక్తులతో తిరుమల కిటకిటలాడుతోండగా భక్తుల గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. .బ్రహ్మోత్సవాల ఆరో రోజున స్వామివారు హనుమంత వాహ‌నంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రకరకాల రంగుల పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు హనుమంత వాహనంపై నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు మలయప్ప స్వామి  అభయప్రదానం చేశారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తజన బృందాల భజనలు, మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాల మధ్య స్వామివారిని కీర్తిస్తుండగా మాడ వీధుల్లో హనుమంత వాహనసేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

సాయంత్రం స్వర్ణరథం, రాత్రికి గజవాహనంపై భక్తులను శ్రీనివాసుడు అభయప్రదానం చేయనున్నారు. బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ నియంత్రణకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.


Similar News