AP Elections 2024: అధికార యంత్రాంగానికి సహకరించండి
సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ లక్ష్యాలను చేరుకోవటంలో అధికార యంత్రాంగానికి, ఓటర్లకు సహకారం అందించాలని జాయింట్ కలెక్టర్, తూర్పు నియోజకవర్గ ఆర్.వో. కె. మయూర్ వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కోరారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ లక్ష్యాలను చేరుకోవటంలో అధికార యంత్రాంగానికి, ఓటర్లకు సహకారం అందించాలని జాయింట్ కలెక్టర్, తూర్పు నియోజకవర్గ ఆర్.వో. కె. మయూర్ వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కోరారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారందరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకోవటంలో ఓటర్లు ఉత్సాహం కనబరచటం లేదని వారిని ప్రోత్సహించి, వారంతా తప్పకుండా ఓటు వేసేలా ఎన్.జి.వో.లు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
పోలింగ్ రోజున ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల అవసరాల రీత్యా యంత్రాంగం తరఫున వసతులు కల్పిస్తున్నామని, ఎన్.జి.వో.లు కూడా తమ వంతు సహాయం అందించాలన్నారు. కొత్తగా ఓటు పొందిన యువతను ప్రోత్సహించాలని, వారిలో చైతన్యం నింపేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కాగా ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఎన్నికల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.