AP:‘ఇసుక దోపిడీ కారణంగా భవన నిర్మాణ కార్మికుల ఆకలి చావులు’..వైఎస్ జగన్ పై మంత్రి అనగాని ఫైర్
గత ఎన్నికల్లో ప్రజలు చెంప చెళ్లుమనిపించేట్లు తీర్పు ఇచ్చినా కానీ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆలోచనల్లో ఎటువంటి మార్పు రాలేదని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
దిశ, ఏపీ బ్యూరో: గత ఎన్నికల్లో ప్రజలు చెంప చెళ్లుమనిపించేట్లు తీర్పు ఇచ్చినా కానీ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆలోచనల్లో ఎటువంటి మార్పు రాలేదని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తానేదో ఎంతో మంచి చేస్తే ప్రజలు పొరపాటున ఓడించారన్నాంటూ జగన్ మాట్లాడుతున్నారని, భూములను కబ్జా చేయడం..ప్రశ్నించిన వారిని చంపేయడమే జగన్ రెడ్డి చేసిన మంచినా అని ప్రశ్నించారు. జగన్ అంతగా ప్రజలకు మంచి చేసి ఉంటే వైసీపీని ఎందుకు అత్యంత ఘోరంగా 11 సీట్లకే పరిమితం చేశారని అడిగారు. మద్య నిషేధం చేస్తానని చెప్పి కల్తీ మద్యంతో వేలాది మంది ఆడపడుచుల తాళిబోట్లు తెంచిన సంగతిని ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. ఇసుక దోపిడీ కారణంగా పనుల్లేక ఆకలితో చనిపోయిన భవన నిర్మాణ కార్మికులు కూడా ప్రజలకింకా గుర్తు ఉన్నారన్నారు.
అధికారంలోకి వచ్చిన నిమిషాల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తానని హామీనిచ్చి ఐదేళ్ల పాటు వారిని నిలువునా ముంచిన సంగతిని ఉద్యోగులు ఇంకా మరచిపోలేదన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే అమలు చేసి ద్రోహం చేసినందునే ప్రజలు జగన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. నీ పరిపాలనలో రాష్ట్రం దివాళా తీసింది వాస్తవం కాదా? జగన్ రెడ్డి అని మంత్రి అనగాని ప్రశ్నించారు. జగన్ హయాంలో ఉద్యోగులకు మొదటి తేదీనే ఎప్పుడైనా జీతాలు వచ్చాయా అని అడిగారు. కూటమి ప్రభుత్వంలో అటు ప్రజలతోపాటు ఇటు ఉద్యోగులు కూడా సంతోషంగా ఉన్నారన్నారు. సుపరిపాలనకు మారుపేరైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెడతామని అన్నారు. ఇచ్చిన హామీలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదు హామీలపై సంతకాలు చేశారని, మిగిలిన హామీలు కూడా అమలవుతాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.