విశాఖ నుంచే పోటీ..అవసరమైతే కొత్త పార్టీ పెడతా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరికొన్ని నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరికొన్ని నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సైతం కసరత్తు మెుదలు పెట్టింది. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిస్తున్నాయి. శీతాకాలంలో కూడా హై టెంపరేచర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అంతేకాదు రాజకీయ సమీకరణాలు సైతం రోజు రోజుకు మారిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీలో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొస్తోంది. సీబీఐ మాజీ జేడీ వీ లక్ష్మీనారాయణ త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచే పోటీ చేస్తానని.. అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. విశాఖలో బుధవారం మీడియాతో మాట్లాడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలని... డబ్బు, మద్యం ప్రభావం లేని రాజకీయం రావాలని తాను ఆశిస్తున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.
డిసెంబర్ 2న మెగా జాబ్ మేళా
రాష్ట్రంలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. ఒకవేళ నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మరోవైపు జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న విశాఖ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ ఫేర్‌కు 50కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని వెల్లడించారు. అక్కడే ఆఫర్ లెటర్‌లు సైతం అందజేస్తామని ప్రకటించారు. అంతేకాదు కొంచె వెనుకబడే అభ్యర్థులకు స్కిల్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామని తెలిపారు. టెన్త్ క్లాస్ ఆపై విద్యార్హత కలిగినవారు ఎవరైనా ఈ జాబ్ ఫేర్‌కు హాజరుకావొచ్చని సూచించారు.
విశాఖ నుంచే పోటీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ జేడీగా వీ లక్ష్మీనారాయణ పనిచేశారు. అనంతరం ఆయన మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. రోజుల వ్యవధిలోనే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేశారు. అలాగే ప్రజల కష్ట నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం ఎంపీగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత కూడా వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. కానీ తాజాగా కొత్త పార్టీ పెడతానని ప్రకటించడం సంచలనంగా మారింది.