రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం.. కురుపాం సభలో సీఎం వైఎస్ జగన్
‘పెత్తందార్లకే అందుబాటులో ఉన్న చదువులు .. ఇప్పుడు పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయి.పెత్తందారీ విద్యావిధానాన్ని బద్ధలు కొట్టి.. అన్నివర్గాలకు ఉన్నతవిద్యను అందిస్తున్నాం.పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాం.
దిశ, డైనమిక్ బ్యూరో : ‘పెత్తందార్లకే అందుబాటులో ఉన్న చదువులు .. ఇప్పుడు పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయి.పెత్తందారీ విద్యావిధానాన్ని బద్ధలు కొట్టి.. అన్నివర్గాలకు ఉన్నతవిద్యను అందిస్తున్నాం.పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాం. ప్రైవేట్ బడులతో ప్రభుత్వ బడులు పోటీపడే పరిస్థితికి చేరుకుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో వరుసగా నాల్గవ ఏడాది జగనన్న అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసేందుకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ‘చదువుల్లో అంటరానితనాన్ని రూపుమాపాం. ప్రభుత్వ బడుల్లోనూ వజ్రాలు, రత్నాల్లాంటి పిల్లలు ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. అమ్మ ఒడి కార్యక్రమాన్ని కురుపాం నుంచి ప్రారంభిస్తున్నామని.. ఈ కార్యక్రమం 10 రోజుల పాటు ప్రతి మండలంలోనూ పండుగ వాతావరణంలో జరుగుతుందని చెప్పుకొచ్చారు. అనంతరం 1 నుంచి 12వ తరగతి దాకా చదివిస్తున్న ఆ అక్కచెల్లెమ్మలు 42.62 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తద్వారా 83.15 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా రూ.6,393 కోట్లు సీఎం జగన్ పది రోజుల పండుగ వాతావరణంలో జమచేస్తున్నట్లు వెల్లడించారు. అయితే అమ్మ ఒడి డబ్బులు అందుకుంటున్న అక్కచెల్లెమ్మలకు మీ అన్నగా, తమ్ముడిగా మీ అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను.
అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇస్తున్నాం. వెయ్యి రూపాయలు మీ పిల్లలకు స్కూల్ మెయింటెన్స్‌కోసం ఇవ్వండి. మరో వెయ్యి కోసం టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం మీరే రూ.2 వేలు మినహాయించుకొని ఇవ్వమని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, జూనియర్ కాలేజీ విద్యార్థులందరికీ కూడా అమ్మ ఒడి వర్తింపజేస్తున్నాం. ఈ ఒక్క పథకం ద్వారా నాలుగేళ్లలో అక్షరాల రూ.26.67 వేల కోట్లు జమ చేశాం. ఈ ఒక్క పథకంతోనే బటన్ నొక్కి నాలుగేళ్లలో ఎలాంటి లంచాలు లేకుండా, వివక్షకు చోటు లేకుండా నేరుగా రూ.26 వేల కోట్లు ఇచ్చాం.బటన్ నొక్కడం అంటే ఇదీ..బటన్ అంటే తెలియని బడుగ్గాయిలకు తెలియజేయండి అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలి
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను తమ కంటే గొప్పగా ఉండాలని, తాను పడిన కష్టాలు తమ పిల్లలకు రాకూడదని కోరుకుంటారు. వచ్చేతరం మనకంటే బాగుండాలని అని కాకుండా ప్రపంచంలోని పోటీని ఎదుర్కొని నిలబడేలా ఆ సవాళ్లను మన బిడ్డలు తట్టుకుని నిలబడాలని, ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలోకి మన పిల్లలు రావాలని గట్టి సంకల్పంతో ఈ నాలుగేళ్లుగా మీ బిడ్డ ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. 70ఏళ్ల చరిత్ర ఉన్న మన రాష్ట్రంలో కేవలం మీ అన్న ప్రభుత్వంలో మాత్రమే ఇది జరుగుతోంది.ఇక మీదట కూడా జరుగుతుంది అని సీఎం జగన్ తెలిపారు. మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం తప్పనిసరిగా బడికి పంపించాలని సభా వేదికపై నుంచి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌మీడియం తీసుకువచ్చాం. బడులు ప్రారంభం మొదలుకాగానే మెరుగైన విద్యా కానుక కిట్లను ప్రతి విద్యార్థి చేతుల్లో పెడుతున్నాం. క్లాస్ టీచర్లకే గతి లేని పరిస్థితి గతంలో చూశాం. కానీ 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా అడుగులు పడ్డాయి అని సీఎం జగన్ పేర్కొన్నారు. 3వ తరగతి నుంచి పిల్లలకు ఇంటర్ నేషనల్ సర్టిఫికేట్ టోఫెల్‌లో రాణించాలని, మన పిల్లలకు విదేశాలకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, గ్లోబల్ సిటిజన్లుగా తయారు కావాలని 3వ తరగతి నుంచే టోఫెల్‌లో ఫ్రిపరేషన్ కోసం కరిక్యూలమ్ తీసుకువచ్చింది మీ జగన్ మామనే అని చెప్పుకొచ్చారు. పిల్లలకు బైలింగ్‌వల్ టెక్స్ట్ బుక్స ఇవ్వడమే కాకుండా బైజూస్ కంటెంట్‌ను కూడా మన పాఠాల్లో అనుసంధానం చేయడం జరిగింది. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌ను డిజిటలైజ్ చేసి, ప్రతి క్లాస్ రూమ్‌లో ఇంటరాక్ట్ డిజిటల్ బోధనలు తీసుకువచ్చాం.రోజుకొక మెనూతో ఒకే రకమైన తిండి తినలేరని, చివరకు పిల్లలకు చిక్కీ, రాగి జావా తీసుకువచ్చి గోరుముద్దగా నామకరణం చేశాం అని సీఎం జగన్ వెల్లడించారు.
ప్రతీ ఇంటి నుంచి సత్యనాదెళ్ల రావాలి
పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి. మన పిల్లలు రేపు సత్యనాదేళ్లతో పోటీ పడాలి. ఒక్క సత్య నాదేళ్ల కాదు ..ప్రతి కుటుంబం నుంచి సత్య నాదేళ్ల రావాలి. చదవలేని పరిస్థితి ఉండకూడదని ప్రపంచంలోనే టాప్ 50 కాలేజీల్లో ఏ పిల్లాడికి సీటు వచ్చినా సరే కోటి 25 లక్షల రూపాయల వరకు పూర్తి ఫీజును భరించేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని సీఎం జగన్ సభలో తెలిపారు. ఈ రోజు స్టాన్‌పోర్డ్, పెద్ద పెద్ద కాలేజీల గురించి మాట్లాడితే లక్షల్లో ఫీజులు ఉంటాయి. ఆ ఫీజులు కట్టలేని తల్లిదండ్రులకు తోడుగా ఈ రోజు ఆ ఫీజులు కోటి 25 లక్షలు అయినా ఫర్వాలేదు. మీ మేనమామ భరిస్తాడు అని సీఎం జగన్ అన్నారు. జీవితంలో స్థిరపడటానికి చదువు ఎంత అవసరమో కూడా అందరికీ గుర్తు ఉండాలని చెప్పి 10వ తరగతి చదవాలన్న నిబంధనను తీసుకువచ్చి వైఎస్‌ఆర్ షాదీతోఫా, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 10 పరీక్షల్లో ప్రభుత్వ స్కూళ్ల నుంచి టాప్ 10 ర్యాంకులు గతేడాది 25 రాగా, ఈ ఏడాది 64 ర్యాంకులు టాప్10లో వచ్చాయి.
75 శాతం పైచిలుకు మార్కులతో డిక్షింక్షన్ సాధించింది గతేడాది 63275 మంది పిల్లలైతే, ఈ ఏడాది 67,114కు పెరిగింది. ప్రభుత్వ స్కూళ్లలో ఫస్ట్ క్లాస్‌లో గతేడాది 65.50 శాతం ఉత్తీర్ణత సాధిస్తే..ఈ ఏడాది ఏకంగా 70.16 శాతానికి పెరిగారు అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో నా ఎస్సీలు, నా ఎస్టీలు, గురుకుల విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపించారు. దాదాపుగా 67 మంది పిల్లలు ఐఐటీ, ఎన్‌ఐటీ, నిప్ట్, సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు దొరికాయి అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. విద్యారంగంలో మనం చేస్తున్న మార్పులతో స్కూళ్లలో విద్యార్థుల శాతం గణనీయంగా పెరిగింది. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియా ప్రకారం 2018–2019లో 84.48 శాతంతో మన రాష్ట్రం దేశంలోనే అట్టగుడు స్థానంలో ఉండేది. ఇప్పుడు 100.80 శాతంతో జాతీయ సగటు 100.13 శాతం కంటే మెరుగ్గా ఉన్నాం.ఇదీ మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
దుష్టచతుష్టయం డ్రామాలు నమ్మెుద్దు
ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలపై సీఎం వైఎస్ జగన్ సభలో విరుచుకుపడ్డారు. ప్రజలకు మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వాన్ని, ఇంత మంచి కనిపిస్తున్నా కూడా జీర్ణించుకోని వారు కొంత మంది ఉన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఏమీ చేయని ఓ నాయకుడు, ఆ నాయకుడి కోసం 15 ఏళ్ల క్రితమే పుట్టిన ఓ దత్త పుత్రుడు. వీళ్లు టీడీపీ (తినుకో, దోచుకో, పంచుకో)తో కలిసి దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకుంటూ , బొజ్జలు పెంచుకుంటూ, బొజ్జ రాక్షసుల పత్రికలు, టీవీలు అన్నీ కూడా మనల్ని విమర్శిస్తున్నాయి అని మండిపడ్డారు. ఆలోచన చేయండి. కడుపు మంట, ఈర్ష్యతో మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అన వద్దు అని మహాత్మా గాంధీ మూడు కోతులు చెప్తే కానీ మన రాష్ట్రంలో మాత్రం మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి అనవద్దు, మంచి చేయవద్దు అని చెప్పే నాలుగు కోతులు ఉన్నాయి. వీరినే దుష్ట చతుష్టయం అని పిలుస్తుంటాం అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ దుష్టచతుష్టయం డ్రామాలు ఆడటం మొదలుపెట్టారు. ఈసారి డ్రామాను కొంచెం రక్తికట్టించారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం, ప్రతి ఇంటికి బెంజికారు ఇస్తామంటారు. మోసం చేయడానికి కూడా ఒక హద్దులు, పొద్దులు లేకుండా పోయారు అని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.