కృష్ణలంకలో చంద్రబాబు విస్తృత పర్యటన.. వరద బాధితులకు పరామర్శ
విజయవాడ కృష్ణలంకలో సీఎం చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు..
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో జల విలయం నెలకొన్న విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో విజయవాడ నగరానికి ఊహించని విధంగా వరదలు వచ్చాయి. బుడమేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. కృష్ణా నది నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా చేరింది. 4 నుంచి 5 అడుగుల మేర ఇళ్లు, రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది.
దీంతో విజయవాడ సింగ్ నగర్, చిట్టీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వరద ముంపు విపరీతంగా ఉంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు విజయవాడలోనే ఉంటూ బాధితుల సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా వరద ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులకు ధైర్యం చెబుతున్నారు. నీరు ఎక్కువగా ఉన్న కృష్ణలంక ప్రాంతంలో తాజాగా చంద్రబాబు జేసీబీపై పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. బాధితులు చెబుతున్న ఇబ్బందులను స్వయంగా వింటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. అధికార యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముంపు బాధితులకు అందిస్తున్న ఆహారం, పాలు, వాటర్‌పై ఆరా తీశారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు తాము సిద్ధం ఉన్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.