దిశ ప్రతినిధి, విశాఖపట్నం : ఒకే సారి రెండు విశ్వవిద్యాలయాలలో రెండు ఉద్యోగాలు. అది అందరికీ సాధ్యం కాదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో, మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి జమానాలోనే అది సాధ్యపడింది. కృష్ణా యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సంతకం. అదే సమయంలో ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, హెడ్‌గా విధుల నిర్వహణ అంటే ప్రభుత్వ నిబంధనలేవీ అంగీకరించవు. కానీ వైసీపీ పాలనలో అదే జరిగింది.
అకాడమిక్ మోసాలు, విలువలు పతనం..
అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఆయన శిష్యుడు ఒకరికి పీహెచ్‌డీని అడ్డగోలుగా ఇప్పించిన డాక్టర్ సి మోజెస్ వినయ కుమార్ ద్వంద్వ వైఖరిపై విచారణ ప్రారంభమైనట్లు తెలిసింది. గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు వెళ్ళటంతో తక్షణం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
అది ఎలా జరిగిందంటే?
కృష్ణా యూనివర్సిటీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుచరుడికి లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో జరిగిన విద్యా సంబంధమైన అక్రమాలు, మోసాలకు సంబంధించిన విషయాలు అన్నీ ఇన్నీ కావు. జగన్ అనుచరుడు ఎం.విశ్వనాథ రెడ్డికి పీహెచ్‌డీ థీసిస్ సమర్పించిన రెండు నెలలలో డాక్టరేట్ ఇప్పించిన ఘనత డాక్టర్ వినయ కుమార్‌కు దక్కుతుంది. దీనిపై విద్యాశాఖ అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ వినయ కుమార్ పర్యవేక్షణలో 16 నవంబర్ 2023న కృష్ణా విశ్వవిద్యాలయంలో విశ్వనాథ రెడ్డి పీహెచ్‌డీ థీసిస్ సమర్పించారు. అదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
విభాగం లేకపోయినా వైవా..
కృష్ణా విశ్వవిద్యాలయంలో జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగం లేనప్పటికీ అభ్యర్థి కోసం వైవా వోస్ 2024 ఫిబ్రవరి 9న నిర్వహించారు. కృష్ణా యూనివర్సిటీలో 2021లో డిపార్ట్‌మెంట్ మూసివేసినందున పీజీ లేదా పీహెచ్డీ కోర్సులలో ప్రవేశం సాధ్యం కాదు. థీసిస్ సబ్మిట్ చేయని రీసెర్చ్ స్కాలర్స్ ఉంటే, డిపార్ట్‌మెంట్ మూసివేయకూడదు. ఇది మొత్తం ప్రక్రియ చట్టబద్ధతకే ప్రశ్నార్ధకంగా మారింది.
తప్పుడు ప్రాతినిధ్యం..
డిపార్ట్‌మెంట్ మూతపడినప్పటికీ, డిపార్ట్‌మెంట్ నుండి పిహెచ్‌డి అవార్డు కోసం 2023 నవంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు ఎం.విశ్వనాధ రెడ్డి థీసిస్ సమర్పించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానం ద్వారా 2021 జూన్ 17న అప్పటికే మూసివేసిన కృష్ణా యూనివర్సిటీ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ లో విశ్వనాధ రెడ్డి వైవా-వోస్ ను 2024న ఫిబ్రవరి లో నిర్వహించారు. అందులో డాక్టర్ వినయకుమార్ కృష్ణా యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పత్రాలపై సంతకం చేశారు. అయితే ఈ తేదీ నాటికి ఆయన అక్కడ పనిచేయడం లేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అంతకుముందే ఎప్పుడోనే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బదిలీ అయిపోయారు. దీనిపై ఆధారాలతో సహా ఫిర్యాదు వెళ్ళింది.
ఆ ప్రొఫెసర్ చేసిందంతా తప్పే..
వినయకుమార్ 2023 నవంబర్ 11న కృష్ణా యూనివర్శిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో రీసెర్చ్ సూపర్‌వైజర్‌గా థీసిస్‌పై సంతకం చేశారు. అప్పటికే కృష్ణా విశ్వవిద్యాలయంలో డిపార్ట్‌మెంట్ మూతపడినప్పటికీ, ఆంధ్రా యూనివర్సిటీకి బదిలీ అయినప్పటికీ వీటన్నింటినీ దాచి సంతకాలు చేసేశారు. యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా ఒక చోట అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, మరొకచోట అసోసియేట్ ప్రొఫెసర్ గా సంతకాలు చేయటంపై ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. కృష్ణా యూనివర్సిటీ నుంచి ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడం ద్వారానే అక్రమంగా బదిలీ అయ్యారని ఆరోపణలపై కూడా విచారణ జరుగుతోంది.