AP:కాకినాడను గ్రేటర్‌గా అభివృద్ధి చేయాలి..పౌర సంఘం డిమాండ్

రమణయ్య పేట అర్బన్ ప్రాంతం గ్రామ పంచాయతీ రాజ్ నుంచి ప్రభుత్వ గెజిట్ ద్వారా వేరు అయినప్పటికి కాకినాడ నగరంలో విలీనం చేయకుండా చేస్తున్న తాత్సారం వలన అభివృద్ధి పనులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పౌర సంఘం, రమణయ్యపేట అభివృద్ధి సంక్షేమ సంఘం పేర్కొంది.

Update: 2024-08-05 12:12 GMT

దిశ,కాకినాడ:రమణయ్య పేట అర్బన్ ప్రాంతం గ్రామ పంచాయతీ రాజ్ నుంచి ప్రభుత్వ గెజిట్ ద్వారా వేరు అయినప్పటికి కాకినాడ నగరంలో విలీనం చేయకుండా చేస్తున్న తాత్సారం వలన అభివృద్ధి పనులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పౌర సంఘం, రమణయ్యపేట అభివృద్ధి సంక్షేమ సంఘం పేర్కొంది. 2013 జూలై 27న జి.వో.ఎం.ఎస్ 360 ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ మేరకు కాకినాడను ఆనుకుని పంచాయతీ ఎన్నికలు లేకుండా పంచాయతీరాజ్ నుండి వేరు చేసిన అర్బన్ గ్రామాలను విలీనం చేసే ఉత్తర్వులను ప్రస్తుతం అమలు చేయాల్సిన అవసరముందన్నారు. 2017 నుండి 2022 వరకు కాకినాడ కౌన్సిల్ ఉండడం వలన గ్రామాల విలీనం జరిగితే అనివార్యంగా పాలక వర్గం రద్దు చేయాల్సి ఉంటుంది. కాబట్టి గత కౌన్సిల్ ఆ జోలికి పోలేదన్నారు. పూర్వ కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ హయాంలో గ్రామ రికార్డులను వెనక్కి ఇవ్వడం వలన విలీనం నిర్వహణ సాంకేతిక సమస్యగా మారిందన్నారు.

ప్రస్తుతం గ్రామ రికార్డులను కార్పొరేషన్ స్వాధీనం చేసుకుని గవర్నర్ ఆర్డినెన్స్ మేరకు అర్బన్ గ్రామాల నిర్వహణను కార్పొరేషన్ అజమాయిషీలోకి తేవాలని కోరారు. ఈ అంశంపై కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలను కలిసి కోరతామని పేర్కొన్నారు. గతంలో పంచాయతీ ఎన్నికలు పెట్టి పాలకవర్గం నిర్ణయాన్ని అనుసరించాలని హైకోర్టు తెలిపి నప్పటికీ వాటి తర్వాత గవర్నర్ ఆర్డినెన్స్ వెలువడిన కారణంగా గడిచి పోయిన అధ్యాయంగా పంచాయితీ ఎన్నికలు జరపాలన్న వాదన వీగి పోయిందన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తగు చర్యలు చేపట్టి జిల్లా కేంద్రాన్ని గ్రేటర్ దిశగా అభివృద్ధి చేయాలని రమణయ్య పేటకు అర్బన్ పౌర సౌకర్యాలు అందించాలని రమణయ్యపేట అభివృద్ధి సంక్షేమ సంఘం కన్వీనర్ అంబటి రామకృష్ణ, ఆర్ సింహాద్రి, ప్రకాష్ , మురళి, కె.శ్రీహరి తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


Similar News