గ్రాడ్యుయేట్లపై గురి.. ఓటర్ల చేరికపై ‘కన్నా’ మార్క్

గ్రాడ్యుయేట్స్‌పై టీడీపీ దృష్టి పెట్టింది.

Update: 2024-10-31 00:41 GMT

దిశ, పల్నాడు: గ్రాడ్యుయేట్స్‌పై టీడీపీ దృష్టి పెట్టింది. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆర్ధిక, సామాజిక అంశాలను బేరీజు వేసుకొని అభ్యర్ధిని ప్రకటించింది. గత రెండు సార్లు పీడీఎఫ్ దక్కించుకున్న స్థానంలో ఈ సారి టీడీపీ మాజీ మంత్రిని గెలుపించుకునేందుకు వ్యూహం పన్నుతోంది.

సత్తెనపల్లిలో కసరత్తు..

పట్టభద్రుల ఓటర్ల చేరిక పై మిగతా నియోజకవర్గాల కంటే భిన్నంగా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పట్టభద్రుల ఓటర్ల జాబితా దృష్టి పెట్టారు. పెద్దమొత్తంలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసే లక్ష్యంతో ప్రక్రియను వేగవంతం చేశారు. అభ్యర్థితో కలిసి నియోజకవర్గంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకునే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం పట్టభద్రుల సామాజిక బాధ్యతని గుర్తుచేస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

పెద్ద సంఖ్యలో ఓట్ల నమోదు..

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు కలిసి తమ అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. నవంబర్ ఆరు వరకే పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉండటంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కేడర్‌తో ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయించారు. బూత్ స్థాయి నుంచి అన్ని అనుబంధ సంఘాలను అప్రమత్తం చేసి శరవేగంగా పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరో వైపు లీగల్ సెల్ అధ్యక్షుడు మద్దినేని వెంకట చలపతిరావు బృందం కన్నా టీంలో కీలకంగా వ్యవహరించడంతో పెద్ద సంఖ్యలో పట్టభద్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.


Similar News