AP News:ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలి:కమిషనర్
నగర ప్రజలకు తాగునీరు అందించే అన్ని ట్యాంకులలో నీటి సాంద్రత పరీక్షలు ప్రతి రోజు తప్పకుండా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు.
దిశ ప్రతినిధి,తిరుపతి:నగర ప్రజలకు తాగునీరు అందించే అన్ని ట్యాంకులలో నీటి సాంద్రత పరీక్షలు ప్రతి రోజు తప్పకుండా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. గురువారం సాయంత్రం మంగళం వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిల్టర్ హౌస్ ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నీరు ఎలా ఫిల్టర్ చేస్తున్నారు? ఎన్ని రకాల పరీక్షలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన నీరు అందించాలని అన్నారు.
ఇందు కోసం అన్ని రకాల నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని అన్నారు. అన్ని పరీక్షల రిపోర్టులు పక్కగా నమోదు చేయాలని, తనకు ప్రతిరోజు వాట్సాప్ మెసేజ్ చేయాలని అన్నారు. నగర ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా, ఎక్కడ నీరు వృధా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో ఎక్కడ కూడా వాటర్ పైపులు, మురుగునీటి పైప్ లైన్లు కలవకుండా నీటి కలుషితం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా పైప్ లైన్ మరమ్మత్తులు వెంటనే సిబ్బంది అప్రమత్తమై పూర్తి చేయాలని అన్నారు.