Tirumala: ఏప్రిల్ 6న ఇక్కడ స్నానమాచరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో వెలసిన తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 6న జరుగనుంది....
దిశ, తిరుపతి: తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో వెలసిన తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 6న జరగనుంది. పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమల శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్య తీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిప్రదాలు కలిగించేవి 7 తీర్థాలు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం, పాండవ తీర్థాలు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం. ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ.
ఈ పర్వదినాన తీర్థ స్నానమాచరించి, దాన ధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.