తిరుమలలో వైభవంగా ముగిసిన అధ్యయనోత్సవాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోని మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు...

Update: 2024-01-05 16:18 GMT

దిశ, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోని మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు. దీంతో 25 రోజులుగా నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు శుక్ర‌వారంతో ముగిశాయి. గ‌త ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుండి 25 రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరిగాయి. ఆఖరి రోజు శుక్రవారం రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని వేంచేపు చేసి, దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు.


25 రోజులుగా శ్రీవారి ఆలయంలో శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా ప్ర‌తి రోజు స్వామివారికి నివేదించారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను పారాయణం చేశారు. అధ్యయనోత్సవాల్లో చివరిరోజు శుక్రవారం కావడంతో తన్నీరముదు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమలనంబి స్మృత్యర్థం ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా నిర్వహించే తన్నీరముదు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధులలో ఆలయ ప్రదక్షిణముగా వాహన మండపానికి వేంచేపు చేశారు. తిరుమలనంబి ఆలయం నుండి ప్రదక్షిణ‌గా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెలతో ఆకాశగంగ తీర్థాన్ని వాహన మండపానికి తీసుకొచ్చారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్‌ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ పండితులు పవిత్ర తీర్థజలంతో ఆలయంలోకి వేంచేపు చేశారు.

అనంతరం ఆల‌య అర్చ‌కులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుమలనంబి రచించిన ''తిరుమొళి పాశురాలను'' పారాయణం చేశారు.ఈ కార్య‌క్ర‌మం లో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.


Similar News