AP News:విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద్ రావు పేర్కొన్నారు.

Update: 2024-08-29 13:40 GMT

దిశ ప్రతినిధి,చిత్తూరు:విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద్ రావు పేర్కొన్నారు. గురువారం జిల్లా క్రీడా మైదానంలో జిల్లా క్రీడా అధికారి బాలాజీ, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్, రాష్ట్ర వాలీబాల్ వైస్ చైర్మన్ జయప్రకాష్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి స్థానిక జిల్లా క్రీడా సాధికారత సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బాల బాలికలు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు చదువుల్లో బాగా రాణించాలంటే ముందు బాడీ ఫిట్నెస్‌గా ఉండాలి, ఫిట్నెస్ గా ఉండాలంటే క్రీడల్లో పాల్గొనాలన్నారు. భారత హాకీ మాజీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ హాకీ ఆట లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా గౌరవించబడ్డారని తెలిపారు. జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొని, జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. జిల్లాలో క్రీడలకు అవసరమైన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో గెలుపొందిన బాల బాలికలకు మరియు క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలకు జ్ఞాపికను మెడల్స్‌ను విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందజేశారు. అనంతరం జిల్లా క్రీడా మైదానం నుండి కలెక్టర్ బంగ్లా, గాంధీ సర్కిల్ వరకు నిర్వహించే ర్యాలీని ఎంపీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి భారత హాకీ మాజీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పీఈటీలు, పీడీలు, వివిధ పాఠశాలల బాల బాలికలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Similar News