తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం
శ్రీవారి పుష్పకైంకర్యాన్ని ప్రారంభించి ఉద్దరించిన వారే వైష్ణవ భక్తాగ్రేసరుడైన అనంతాళ్వార్ అని తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి తెలిపారు...
దిశ తిరుమల: శ్రీవారి పుష్పకైంకర్యాన్ని ప్రారంభించి ఉద్దరించిన వారే వైష్ణవ భక్తాగ్రేసరుడైన అనంతాళ్వార్ అని తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి తెలిపారు. వైష్ణవ భక్తాగ్రేసరుడు, రామానుజాచార్యుల శిష్యులలో ప్రముఖుడైన అనంతళ్వారు 970వ అవతారోత్సవం తిరుమల పురశైవారితోటలో ఆదివారం నిర్వహించారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో 300 మందికిపైగా అనంతళ్వారు వంశీకులు పాల్గొన్నారు. అనంతరం ''నాలాయిర దివ్యప్రబంధ గోష్ఠిగానం'' నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి అనుగ్రహషణం చేశారు. 102 ఏళ్ళ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో స్వామివారికి వైష్ణవ భక్తాగ్రేసరుడు అనంతాళ్వార్ పుష్పకైంకర్యాన్ని ప్రారంభించి ఉద్దరించారని కొనియాడారు. అనంతాళ్వారు వంశీకులు కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావహమని చెప్పారు. తిరుమలలో వివిధ రకాల సుగంధభరిత పుష్పాల మొక్కలతో కూడిన పుష్పాల తోటను ఏర్పాటు చేశారని తెలిపారు. తన జీవితాన్ని భగవంతుడి పాదాలవద్ద పుష్పంగా సమర్పించుకున్నారని అనంతాళ్వార్ జీవిత వైశిష్ట్యం గురించి వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రముఖ శ్రీ వైష్ణవ పండితులచే అనంతాళ్వార్ల జీవిత విశేషాలపై సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారి పురుషోత్తం, అనంతాళ్వార్ వంశీకులు రంగాచార్యులు, గోవిందాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.