AP News:‘జగన్ విధ్వంసం గుర్తు చేసేందుకే ప్రజావేదిక’.. మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు

అధికారంలోకి రాగానే వైఎస్​ జగన్​ ప్రజావేదికను కూల్చి వేశారు. దాని శిథిలాలను అలాగే ఉంచాం.. దానిని గుర్తు చేసేందుకే ప్రజావేదిక పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్​ పేర్కొన్నారు.

Update: 2024-09-20 07:55 GMT

దిశ ప్రతినిధి, చిత్తూరు: అధికారంలోకి రాగానే వైఎస్​ జగన్​ ప్రజావేదికను కూల్చి వేశారు. దాని శిథిలాలను అలాగే ఉంచాం.. దానిని గుర్తు చేసేందుకే ప్రజావేదిక పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్​ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని బంగారుపాళ్యం మండల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ యూనిట్​ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు డయాలసిస్​ యూనిట్​ను ప్రారంభించినట్లు తెలిపారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువత ఉత్సాహం చూపింది. చిన్న పిల్లలను ఎత్తుకుని ముద్దు చేశారు. స్థానికుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. రెడ్​ క్రాస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కూడా ఆయన ప్రారంభించారు.

అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తైన సందర్భంగా ఎన్ కోటూరు వద్ద నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్​ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులు పరదాలు కట్టుకుని తిరిగారని అన్నారు. తన యువగళం పాదయాత్రలో ప్రజలు సమస్యలు తెలుసుకుని సీఎం చంద్రబాబుకు వివరించగా, దానిని పరిశీలించి సూపర్​ సిక్స్​ప్రవేశపెట్టారని అన్నారు. తనపై 23 కేసులు పెట్టారని అన్నారు. అయినా తగ్గేదేలె అని చెప్పానని తెలిపారు. ఇక్కడి డయాలసిస్​ సెంటర్​ కోసం ప్రభుత్వం రూ.3 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు.

మెగా డీఎస్సీ, మద్యపాన నిషేధం అంటూ జగన్​ ప్రజలను మోసం చేశాడని అన్నారు. తాము అధికారంలోకి రాగానే పింఛను రూ.4000గా చేసి చూపించామని తెలిపారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీస్సీ పై పెట్టామని అన్నారు. శ్రీవారి లడ్డూలో అవినీతి చేసి పంది కొవ్వు, చేప నూనె కలిపారని ఆయన ఆరోపించారు. ఏడుకొండలపై రాజకీయం చేస్తున్నారు.. ఇది అన్యాయం అని ఆనాడే చెప్పానని అన్నారు. మంత్రి లోకేష్‌తో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, జీడి నెల్లూరు, నగరి ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, కలికిరి మురళీమోహన్, అమర్నాథ్ రెడ్డి, థామస్, గాలి భాను ప్రకాష్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తదితర జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News