AP News:పర్యాటక రంగ అభివృద్ధికి మరింత చేయూత:జిల్లా కలెక్టర్
తిరుపతి జిల్లాను పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు కలవని, ఆ దిశగా పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం వలన పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
దిశ ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జిల్లాను పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు కలవని, ఆ దిశగా పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం వలన పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్ర నాథ్ రెడ్డి , ఎస్ వి జూ పార్క్ క్యూరేటర్ సెల్వంతో కలిసి జిల్లా పర్యాటక శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి విస్తారమైన అవకాశాలు కలవని తెలిపారు. యాత్రికులను ఆకర్షించే దిశగా జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలైన ముఖ్య బీచ్ వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎకో టూరిజం క్లబ్బులను వివిధ పాఠశాలలు, కళాశాలలో ఏర్పాటుచేసి పర్యాటక రంగ అభివృద్ధి దిశగా వారికి అవగాహన కల్పించాలన్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా లఘు చిత్ర పోటీలు నిర్వహించడం వలన పర్యాటక రంగంపై ఆసక్తి తో పాటు పర్యాటక ప్రదేశాల గురించి ప్రజలకు అవగాహన కలుగుతుంది అని తెలిపారు.