Tirumala: ఈ మంత్రి ఇంత డిఫరెంటా.. పవన్‌ను పొగిడాడా.. తిట్టాడా..?
పవన్ కల్యాణ్‌పై మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలంతా నోరేసుకుని పడిపోతుంటే.. మంత్రి విశ్వరూప్ మాత్రం భిన్నంగా ఉన్నారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేయకుండా, అలాగని పొగడకుండా సుతిమెత్తంగా సూది పోటు మాటలు మాట్లాడారు. పవన్ కల్యాణ్ లక్ష్యాన్ని అర్థం చేసుకున్నట్టే సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలంటే ఏం చేయాలో చెబుతూనే హిత బోధ చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలనేదానిపై పవన్‌కు సలహాలు, సూచనలు చేశారు. పవన్ కల్యాణ్ ఆశయాన్ని తాను కూడా సమర్థిస్తున్నట్లు మాట్లాడి జనసేన నాయకులకు చురకలంటించారు.
వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండని.. తాను అధికారంలోకి వస్తే మంచి సీఎం అనిపించుకుంటానని.. లేదంటే తానే రాజీనామా చేస్తానని చెబుతున్నారు. దీంతో మంత్రి విశ్వరూప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన పవన్ కల్యాణ్ సీఎం కావాలని అభిమానులే కాదని, తాను సైతం కోరుకుంటున్నట్లు తెలిపారు. జనసేనాని ముఖ్యమంత్రి అవ్వాలంటే ముందు 175 స్థానాల్లో పోటీ చేయాలని సూచించారు. కనీసం 100 స్థానాల్లో పోటీ చేసి 50 చోట్ల గెలిచి, ఆ తర్వాత అధికారం కోసం ప్రయత్నం చేయాలని సుతిమెత్తంగా చురకలు అంటించారు. రాష్ట్రంలో ఎవరైనా ఏ యాత్రలైనా చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.
ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి ఏపీలో జరుగుతోందని.. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారని మంత్రి విశ్వరూప్ తెలిపారు.