Chittoor: అంగన్వాడీల్లో వెరీ‘గుడ్డు’
పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల్లో కోడిగుడ్డుకు ప్రత్యేక స్థానం ఉంది..
దిశ, తిరుపతి: పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల్లో కోడిగుడ్డుకు ప్రత్యేక స్థానం ఉంది. కంటి చూపునకు మేలు చేయడంతో పాటు రక్తహీనత నివారించడం ఎముకల్లో బలం చేకూర్చడం, కావాల్సిన విటమిన్లు అందించేందుకు ఇది ఏంతో ప్రయోజనం చేకూర్చుతుంది. ఈ ప్రాముఖ్యత గుర్తించిన ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లను ఉచితంగా అందిస్తోంది. చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు ఉడికించి అందజేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో సరఫరా సరిగా లేక ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని విద్యార్థులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో గుడ్ల సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని అధికారులను ఆదేశించింది. అంగన్ వాడీ కేంద్రాలకు గుడ్డు సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. లబ్ధిదారులకు స్వయంగా అందజేసేలా చర్యలు తీసుకుంది.
రోజూ 1.46 లక్షల మందికి సరఫరా
నెలలో పది రోజులకు ఒక రంగు చిహ్నంతో మూడు రంగుల్లో సరఫరా చేయాలని నిర్ణయించిం ది. 1-10 తేదీల మధ్య బ్లూ 11-20 తేదీల మధ్య సింక్, 21 నుంచి నెలాఖరు వరకు గ్రీన్ రంగు గుర్తు ఉన్న గుడ్డును సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారమే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఐసీడీఎస్ అధికారులు అంగన్వాడీ కేంద్రాలకు గుడ్డను సరఫరా చేస్తున్నారు. వేసవి కాలం రావడంతో గుడ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సూపర్‌వైజర్లతో ప్రత్యేక తనిఖీలు చేయిస్తున్నారు. అర్జీదారులకు నాణ్యమైన గుడ్లును అందించేలా చూస్తున్నారు