నా పొరపాటును మన్నించండి.. దేవాంగులకు Balakrishna క్షమాపణ

ఇటీవల దేవబ్రాహ్మణులపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో దేవాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కించపర్చే వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు...

Update: 2023-01-15 08:07 GMT

దిశ, వెబ్ డెస్క్:  దేవబ్రాహ్మణులపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇటీవల వైరల్ అయ్యాయి. దీంతో దేవాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కించపర్చే వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాలకృష్ణ స్పందించారు. పొరపాటున మాట్లాడానని.. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని ప్రెస్ నోట్ విడుదల చేశారు. తనకు ఎదుటి వాళ్లను బాధపెట్టాలన్న ఆలోచన లేదని.. తన వ్యాఖ్యల వల్ల దేవాంగులు హర్ట్ అయ్యారని తెలిసి బాధపడ్డానని తెలిపారు. సాటి సోదరుల మనసు గాయపర్చడం వల్ల తనకేం ప్రయోజనమని... తన వాళ్లను తాను బాధపెట్టుకుంటానా..?. అని పేర్కొన్నారు. దేవాంగ సోదరులు అర్ధం చేసుకుని తన పొరపాటును మన్నించాలని ప్రెస్‌నోట్‌లో బాలకృష్ణ కోరారు.

ప్రస్తుతం బాలకృష్ణ నారావారిపల్లి సంక్రాంతి సంబురాలు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఆయన స్వగ్రామానికి వెళ్లిన బాలకృష్ణ ఫ్యామిలీ అక్కడ సందడి చేస్తోంది. భోగి సందర్భంగా శనివారం చంద్రగిరిలో 'వీరసింహారెడ్డి' సినిమా చూశారు. దేవాంగులపై చేసిన కామెంట్స్‌పై స్పందించిన బాలకృష్ణ.. హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రెస్ నోట్ విడుదల చేశారు. 


Similar News