AP News:ఆంధ్రప్రదేశ్‌ని మత్తు ప్రదేశ్‌గా మార్చేశారు: కాంగ్రెస్ అభ్యర్థి

గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో యువత మత్తులో తూగుతూ వారి జీవితాలతో పాటు కుటుంబాలను కూడా గుల్ల చేస్తున్నారని, ఇందుకు జగన్మోహన్ రెడ్డి పాలనే కారణమని కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి చింతా మోహన్ ఆరోపించారు.

Update: 2024-05-05 14:19 GMT

దిశ ప్రతినిధి,తిరుపతి: గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో యువత మత్తులో తూగుతూ వారి జీవితాలతో పాటు కుటుంబాలను కూడా గుల్ల చేస్తున్నారని, ఇందుకు జగన్మోహన్ రెడ్డి పాలనే కారణమని కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి చింతా మోహన్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియాతో చింతా మోహన్ మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని సహజ వనరులను దోచేసారని మండిపడ్డారు.

తిరుపతి పుణ్యక్షేత్రంలో అభివృద్ధి ఎక్కడ కానరాలేదనీ,పేదరికం స్పష్టంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావంతులు ఉన్నత స్థాయికి చేరుకోలేక నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక వారి కుటుంబాలు కష్టాల ఊబిలో కూరుకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. త్రిబుల్ తలాక్ పేరుతో భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టారని ధ్వజమెత్తారు. మోడీ ప్రధాని కాకముందు వేల కోట్లల్లో ఉన్న ఆదని ఆస్తులు మోడీ వచ్చాక లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ధరలు తగ్గాలన్న, పేదరికం పోవలన్నా, దేశంలో శాంతి నెలకొనలన్నా, ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.


Similar News