AP News:నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు..మంత్రి సవిత కీలక ఆదేశం
రేణిగుంట బీసీ వసతి గృహంలో అస్వస్థతకు గురైన 21 మంది ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని, రుయా ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జి చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
దిశ ప్రతినిధి,తిరుపతి:రేణిగుంట బీసీ వసతి గృహంలో అస్వస్థతకు గురైన 21 మంది ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని, రుయా ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జి చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడటంతో, విద్యార్థులు పాఠశాలకు వెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీసీ వసతి గృహ అధికారులపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ మేరకు మంగళవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. విషయం తెలిసినప్పటి నుంచి ప్రతి క్షణం తిరుపతి డీఎం అండ్ హెచ్వోతో, రుయా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా కృషి చేశామన్నారు. అదే సమయంలో బీసీ వెల్ఫేర్ డీడీని ఆసుపత్రికి పంపి, విద్యార్థులకు వైద్య సదుపాయాలు అందించేలా చేశామన్నారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో, ప్రస్తుతం విద్యార్థులు పాఠశాలకు కూడా వెళ్లినట్లు మంత్రి తెలిపారు.
ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు..
తిరుపతి రేణిగుంట బీసీ వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో మంత్రి సవిత ఆదేశాల మేరకు ఇద్దరు అధికారులకు బీసీ వెల్ఫేర్ అధికారులు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇన్చార్జి బీసీ వెల్ఫేర్ అధికారి చంద్రశేఖర్ కు, ఏబీసీడబ్ల్యూఓ డి.జ్యోత్స్నకు బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లికార్జున ఈ నోటీసులు జారీ చేశారు. నోటీసులందుకున్న మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.