చైల్డ్ రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు
విశాఖలో చైల్డ్ రాకెట్ ముఠా పట్టుబడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
దిశ, వెబ్ డెస్క్ : విశాఖలో చైల్డ్ రాకెట్ ముఠా పట్టుబడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ముఠా నుండి 6 పిల్లల్ని పోలీసులు రెస్క్యూ చేశారు. 17 మంది నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. విశాఖపట్నం సీపీ శంకబ్రత మాట్లాడుతూ.. ఇటీవల సిరిపురంలో ఓ చిన్నారిని అమ్మకానికి పెట్టినట్టు టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందడంతో మరింత నిఘా పెట్టి విచారిస్తే పిల్లల్ని ఎత్తుకెళ్ళే మాఫియా బయట పడిందని అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి శిశువులను ఎత్తుకెళ్ళి రూ.లక్షల్లో వారిని అమ్ముతున్నట్టు తేలిందన్నారు. సోమవారం పట్టుబడిన ముఠా నుండి ఆరుగురి పిల్లల్ని రక్షించామని, 17 మందిని ఇప్పటికే అరెస్టు చేశామని, మరికొంత మందిని అరెస్ట్ చేయనున్నట్టు సీపీ వివరించారు. ఈ ముఠాతో ఒడిషా, ఢిల్లీలలోని మరిన్ని ముఠాలకు సంబంధాలు ఉన్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా వీరి నెట్ వర్క్ ఉందని, త్వరలోనే వాటన్నిటినీ పట్టుకుంటామని సీపీ పేర్కొన్నారు. కాగా విశాఖ నగరంలో చాలా ఆసుపత్రుల్లో సరైన నిఘా వ్యవస్థ లేనందున వీరి పని సులువైందని, ఇప్పటికైనా సెక్యూరిటీ వ్యవస్థలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.