చెల్లెమ్మా పురంధేశ్వరి!భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా?: విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌పై దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు.‘చెల్లెమ్మా పురంధేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్‌ని తిట్టడమే పనిగా పెట్టుకొని...మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా?’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అంటూ విజయసాయిరెడ్డి ట్వీటర్ వేదికగా నిలదీశారు.
తెలంగాణలో కాంగ్రెస్ కోసం ఆరాటం
ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల గురించి మాత్రమే ప్రస్తావిస్తూ విమర్శలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పురంధేశ్వరికి లింక్ పెడుతూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో పురంధేశ్వరి వేలు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలన్న ఆలోచనలో పురంధేశ్వరి ఉన్నారని చెప్పుకొచ్చారు. కానీ తన బీజేపీ పార్టీని గెలిపించుకోవాలని కాకుండా కాంగ్రెస్ గెలుపుకోసం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ కు మద్దతుగా తెలుగుదేశం పార్టీని అక్కడ పోటీలో నిలపొద్దని సలహా ఇచ్చిందే పురంధేశ్వరి అంట అంటూ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో తమ ఆస్తులు కాపాడుకునేందుకే పురంధేశ్వరి కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించుకుంటే తాము అధికారంలో ఉన్నట్లేనని పురంధేశ్వరి అనుకుంటున్నారని.. తమ సామాజిక వర్గంవారికి చెందిన ఆస్తులను కాపాడుకునేందుకే ఇదంతా చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి బీజేపీ కోసం కాకుండా తన సామాజికవర్గ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారని...ఇప్పటికే కాంగ్రెస్ కోసం టీడీపీని సైడ్ చేసేసారని... ఇలాంటివి ఎన్నయినా చేయడానికి పురంధేశ్వరి సిద్దంగా ఉన్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. బీజేపీని గెలింపించుకునేందుకు తెలంగాణతో పాటు జాతీయ నేతలు ప్రయత్నిస్తుంటే దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే పనిలో పడ్డారని వైసీపీ పార్లమెంటరీ నేత పురంధేశ్వరి ఆరోపించారు.