కేవలం అలాంటి వారినే పార్టీలో చేర్చుకుంటాం.. చంద్రబాబు సంచలన షరతు
టీడీపీలో చేరికలపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో చేరేందుకు ఎవరు సిద్ధమైనా రాజీనామా చేసాకే రావాలని షరతు పెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీలో చేరికలపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో చేరేందుకు ఎవరు సిద్ధమైనా రాజీనామా చేసాకే రావాలని షరతు పెట్టారు. వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలో చేరికలు ఉంటాయని అన్నారు. రాజకీయాల్లో ఎంతటి వారైనా విలువలు పాటించాలని సూచించారు. అంతకుముందు కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్ల నిధులు, రాష్ట్రంలో 2 ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి సంబంధించిన రెండు అంశాలను కేంద్రం క్లియర్ చేసిందని, కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశ కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఒక నమ్మకం, భరోసా ఇస్తున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని పేర్కొన్నారు.