ప్రసంగాలు చేయడం కాదు దమ్ముంటే చర్చకు రా.. సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్
ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఆదివారం చంద్రబాబు మాట్లాడుతూ.. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంస పాలన ఎదరిదో తేల్చుకోవడానికి తాను చర్చకు సిద్ధమని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు.
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఆదివారం చంద్రబాబు మాట్లాడుతూ.. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంస పాలన ఎదరిదో తేల్చుకోవడానికి తాను చర్చకు సిద్ధమని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. బూటకపు ప్రసంగాలు కాదని.. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని చాలెంజ్ చేశారు. ఆ చర్చలో ఎవరి పాలన స్వర్ణ యుగమో.. ఎవరి పాలన రాతి యుగమో తేల్చేద్దామని అన్నారు. 2019 ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశమే రాజకీయంగా చివరి అవకాశం అని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచేయడానికి రాష్ట్ర ప్రజలు కసితో ఉన్నారని అన్నారు. ఓటమి భయంతోనే బదిలీలు అంటూ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. 77 మందిని జగన్ మడతపెట్టారు.. మిగిలిన వారిని 50 రోజుల్లో జనం మడతపెడతారని అన్నారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్న జగన్ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గుగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి జరుగకపోగా.. ఏ ఊరికెళ్లినా జగన్ విధ్వంసం కనిపిస్తోందని అన్నారు. ఫ్యాన్ ఇంట్లో తిరుగుతూ ఉండాలి.. సైకిల్ ఇంటి బయట ఉండాలి.. తాగేసిన గ్లాస్ సింక్‌లోనే ఉండాలని అంతకుముందు నిర్వహించిన సభలో సీఎం జగన్ డైలాగులు కొట్టడంతో సభ దద్దరిల్లింది. తాజాగా ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.