Bridge construction:వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి:జిల్లా కలెక్టర్

గంటి పెదపూడి లంక, ఊడిమూడిలంక మధ్య వశిష్ట గోదావరిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులు గుత్తేదారులను ఆదేశించారు.

Update: 2024-11-08 12:47 GMT

దిశ, అమలాపురం /పి గన్నవరం: గంటి పెదపూడి లంక, ఊడిమూడిలంక మధ్య వశిష్ట గోదావరిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులు గుత్తేదారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పి గన్నవరం మండలంలోని ఊడిమూడిలంక, బురుగులంక, అరిగెల వారి పేట, పెదపూడి లంక గ్రామాలను బాహ్య ప్రపంచంతో కలుపుతూ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులతో రూ 49.50 కోట్లతో వశిష్ట గోదావరిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. సంబంధిత బ్రిడ్జ్‌కు అప్రోచ్ రోడ్డు నిర్మించడానికి ఎంత మేరకు మట్టి అవసరమని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణారెడ్డిని అడుగగా ఇంకా 25 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టి అవసరమవుతుందని ఆయన తెలిపారు.

ఈ వంతెనను 10 స్పాన్స్ కలిగి ఒక్కొక్కటి 34.2 మీటర్ల పొడవు 7.5 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నామని.. ఇప్పటికే 40% వరకు నిర్మాణం పూర్తయిందని .. 21 కోట్ల రూపాయల బిల్ల్స్ అప్లోడ్ చేశామని పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్యం రాంబాబు కలెక్టర్కు వివరించారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి రైతులకు 4.32 ఎకరాలకు రూ 2.50 కోట్ల రూపాయలు చెల్లించాలని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. బ్రిడ్జి నిర్మాణానికి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్యం రాంబాబు, పి. గన్నవరం తహసీల్దార్ పల్లవి, పి గన్నవరం ఎంపీడీవో ప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్ కొండలరావు,అసోసియేట్ ఇంజనీర్స్ ఎంటర్ప్రైజ్ కాంట్రాక్టర్ పిఎస్ రాజు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News