BREAKING: నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయ్.. భయమేస్తోంది: యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖంగా వినిపించిన పేరు యాంకర్ శ్యామల.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖంగా వినిపించిన పేరు యాంకర్ శ్యామల. వైసీపీ తరపున ప్రచారం చేసిన ఆమె జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ఈ పరిణామంతో సోషల్ మీడియాలో జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు శ్యామలను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయాన్ని సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. మరోవైపు వైసీపీ కేవలం 11 సీట్లు సాధించి ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా యాంకర్ శ్యామల ఓ వీడియోను రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియోలో శ్యామల మాట్లాడుతూ.. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొంది.
అదేవిధంగా అఖండ విజయం సాధించిన కూటమి ప్రతినిధులు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ గెలుపుకోసం అవిశ్రాంతంగా శ్రమించిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన నాడు విర్రవీగలేదని.. ఓటమి ఎదురైన నాడు కుంగిపోలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోమోహన్ రెడ్డి మరింత బలాన్ని పుంజుకుని అధికారంలోకి వస్తారని తెలిపారు. వైసీపీ ఓడిన నాటి నంచి తనకు విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శ్యామల ఆందోళన వ్యక్తం చేసింది. అందరిలానే తాను కూడా ప్రజాస్వామ్యంలో ఓ పార్టీకి మద్దతుగా నిలిచానని, ఆ విషయాన్ని అందరూ సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. తాను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదని.. దయచేసి విషాయాన్ని అర్థం చేసుకోవాలని శ్యామల కోరారు.