విశాఖలో సీజీహెచ్ఎస్ కేంద్రం ఏర్పాటుకై కేంద్రమంత్రికి ఎంపీ జీవీఎల్ వినతి

విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు.

Update: 2023-05-09 12:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాను బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలిశారు. విశాఖపట్నంలో సీజీహెచ్ఎస్ అదనపు డైరెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించి విశాఖపట్నంలో సీజీహెచ్‌ఎస్ సౌకర్యాలను మెరుగుపరుస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.మన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాను కలిసి విశాఖపట్నంలో సీజీహెచ్ఎస్ మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలను మెరుగుపరచాల్సిన తక్షణ అవసరాన్ని ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న రెండు సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ సెంటర్‌లు చాలా ప్రాథమికమైనవని, మరియు వాటి భవనాలు, మౌలిక సదుపాయాలు రెండింటినీ అప్‌గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఉందని, మెరుగైన మౌలిక సదుపాయాల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ జీవీఎల్ కోరారు.

ఈ సందర్భంగా విశాఖపట్నంలో సీజీహెచ్‌ఎస్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 30 సెంట్ల స్థలాన్ని కొనటానికి నిధులను త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో కనీసం ఒక కొత్త వెల్‌నెస్ సెంటర్‌ను గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్రమంత్రికి సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక రాష్ట్ర సిజిహెచ్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈ పరిణామాలతో విశాఖపట్నంలో సీజీహెచ్‌ఎస్ అదనపు డైరెక్టర్ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయమై 2022 డిసెంబర్ 21న రాజ్యసభలో ప్రత్యేకంగా ప్రస్తావించి రాజ్యసభలో ఈ అంశాలను లేవనెత్తానని కేంద్రమంత్రికి ఎంపీ జీవీఎల్ గుర్తు చేశారు.

Tags:    

Similar News