రాష్ట్రంలో భారీ స్కాం.. సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
గత ప్రభుత్వ హయాంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వ హయాంలో భారీగా లిక్కర్ స్కామ్(Liquor scam) జరిగిందని, సీబీఐ(Cbi), ఈడీ(ED)తో సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు(BJP MLC Somu Veerraju) డిమాండ్ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్‌ను తాను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరుగుతోందని గతంలోనే తాను చెప్పానని, కానీ తనను ట్రోల్ చేశారని గుర్తు చేశారు. రూ. 4 వేల కోట్ల స్కాం కాదని, ఇంకా చాలా పెద్దదని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో ప్రజా ధనం వృధా అయిందని, వేల కోట్లు ఇతరుల జేబుల్లోకి వెళ్లాయని సోము వీర్రాజు ఆరోపణలు చేశారు.
కూటమి ప్రభుత్వంలో మద్యం బ్రాండ్స్ అన్ని బయట నుంచి కొంటున్నారని, గత ప్రభుత్వంలో లిక్కర్ కంపెనీలను, ఫిల్లింగ్ సెంటర్లను వైసీపీ వాళ్లే స్వాధీనం చేసుకున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. రూ.5, రూ.6కు చీప్ లిక్కర్ తయారు చేసి దాన్ని అధిక ధరలకు ప్రభుత్వం కొనుగోలు చేసి ఇష్టమొచ్చిన బ్రాండ్ల పేరుతో అమ్మకాలు జరిపిందన్నారు. అయితే జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కాంలో లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. లిక్కర్ స్కాంపై సీఎం రమేశ్(CM Ramesh)తో ఇప్పటికే తాను చర్చించానని తెలిపారు. రాష్ట్రంలో కూటమి నాయకులందరం కలిసి మాట్లాడుకుని ఓ మాటపై ముందుకు వెళ్తామన్నారు. లిక్కర్ స్కాంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఐడీతో దర్యాప్తు చేయిస్తోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు.