ఏచూరి మృతి వెనుక బీజేపీ కుట్ర : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2024-09-28 11:06 GMT

దిశ, వెబ్ డెస్క్ :  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీతారాం ఏచూరి మృతి వెనుక కుట్ర దాగి ఉందని..ఆయన మృతి వెనుక బీజేపీ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. సీపీఐ(ఎం) సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న 72 ఏళ్ల సీతారాం ఏచూరి ఛాతి సంబంధ సమస్యలతో .. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఏచూరి మరణంపై చింతామోహన్ తాజాగా చేసిన ఆరోపణలు వైరల్ గా మారాయి. ఆసుపత్రిలో ఒక స్వెన్ ఫ్లూ కేసు రోగి పక్కన సీతారాం ఏచూరిని ఉంచారని.. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు.. ఇక, ఏచూరికి మెరుగైన వైద్యం అందించకుండా కూడా బీజేపీ కుట్రలు చేసిందని చింతా మోహన్ ఆరోపించారు.

తిరుమల లడ్డూ కల్తీ...మాజీ సీఎం వైఎస్ జగన్ డిక్లరేషన్ వివాదంపై చింతామోహన్ స్పందిస్తూ మానవత్వం గురించి వైఎస్ జగన్ మాట్లాడడం విడ్డూరమన్నారు. సొంత ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొట్టించడం మానవత్వమా?.. ఇదేనా ప్రేమ..? అని ప్రశ్నించారు.. సెక్యులరిజంపై జగన్ నిన్నటి వరకు బీజేపీతో కలిసి నాట్యం చేసి ఇప్పుడు మాట్లాడడం ఏంటి? అని ఎద్దేవా చేశారు. దళితులపై ప్రేమ కురిపిస్తూ మాట్లాడుతున్న జగన్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకు మూసేశాడని.. స్కాలర్ షిప్ లు ఎందుకు ఆపేశాడని నిలదీశారు. వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇస్తే ఏమవుతుందని.. ఎడమ చేతితో సంతకం చేయి.. ఎంతో మంది సంతకాలు పెట్టి పోయారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తిరుమల లడ్డూ వ్యవహారంలో సైలెంట్ గా ఉండు అని.. నీకు ఉన్న కొంచెం పరువు కూడా తీసేశారని అంటూ జగన్ పై చింతామోహన్ విమర్శలు గుప్పించారు.


Similar News