వామ్మో... Khammam టీడీపీ సభ వెనుక అంతప్లానుందా?

అక్కడా ఇక్కడా మనమే. రెండు రాష్ట్రాల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖమ్మం సభలో వ్యాఖ్యానించారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా చంద్రబాబు తెలంగాణపై దృష్టి సారించడం గురించి ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

Update: 2022-12-23 13:39 GMT

దిశ, ఏపీ బ్యూరో: అక్కడా ఇక్కడా మనమే. రెండు రాష్ట్రాల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖమ్మం సభలో వ్యాఖ్యానించారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా చంద్రబాబు తెలంగాణపై దృష్టి సారించడం గురించి ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఏపీలోకి బీఆర్‌ఎస్​ ప్రవేశిస్తే టీడీపీకి గండి పడే అవకాశముందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా తెలంగాణలో సెటిలర్స్​కేసీఆర్​కు అండగా ఉన్నారు. వాళ్లందర్నీ తిరిగి టీడీపీ వైపు తీసుకొచ్చే ఎత్తుగడనే ఖమ్మం సభ వెనుక ఆంతర్యమని మరికొందరంటున్నారు. దీంతో కేసీఆర్‌కు ఝలక్​ఇచ్చినట్లవుతుందని చెబుతున్నారు. అసలు ఇవన్నీ కాదు. కేసీఆర్‌కు మంట పెట్టడం ద్వారా బీజేపీ పెద్దలకు దగ్గరవ్వాలనే యోచనతోనే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వైసీపీ ప్రశ్నలు.. వాటిపై బీజేపీ కేంద్ర మంత్రుల వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కేంద్ర పెద్దలు వైసీపీ సర్కారుకు దగ్గరగా లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించింది. ప్రత్యేక హోదా లేదని తేల్చేశారు. పోలవరం 2024 నాటికి పూర్తి చేయడం కుదరదని కుండ బద్దలు కొట్టారు. ఏపీలో రోజువారీ కూలీల ఆత్మహత్యలు మూడింతలు పెరిగినట్లు చెప్పుకొచ్చారు. ఐఏవై కింద సుమారు 1.8 లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేసినా ఏపీ ప్రభుత్వం కేవలం ఐదు ఇళ్లు మాత్రమే నిర్మించిందని సీఎం జగన్​ పరువు దీశారు. అంతేకాదు. ఓ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని మంత్రి నిర్మలా సీతారామన్​ఏపీ సర్కారును పరోక్షంగా ఎత్తిపొడిచారు.

ఈ పరిణామాలన్నింటిని నిశితంగా పరిశీలిస్తే ఢిల్లీలోని బీజేపీ పెద్దలు వైసీపీకి దూరంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. వాళ్ల ప్రోద్భలంతోనే చంద్రబాబు తెలంగాణలో తమ్ముళ్లను కేసీఆర్​నుంచి వేరు చేసేందుకు పూనుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. లిక్కర్​కేసులో శరత్​చంద్రారెడ్డి, మాగుంట పేర్లను ప్రముఖంగా ప్రస్తావించడం వెనుక కూడా ఈ మతలబు దాగి ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్​వైపు టీడీపీ శ్రేణులు మొగ్గు చూపకుండా ఏమేరకు సక్సెస్​అవుతారో తెలీదు. బీజేపీ పెద్దల వ్యూహంలో భాగంగానే చంద్రబాబు అడుగులు పడుతున్నట్లు తేటతెల్లమవుతోంది. చంద్రబాబు వైఖరికి రాష్ట్రంలో స్పందన ఎలా ఉంటుందోనని ఆ పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News