AP News: ఉప్పొంగుతున్న తుంగభద్ర.. అన్నదాత ఆశలు తీర్చనుందా..?

ఉమ్మడి అనంతపురం జిల్లా పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది కరువు.

Update: 2024-07-05 02:33 GMT

దిశ ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది కరువు. దేశంలోనే జై సల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతమిది. ఎడారిలో ఒయాసిస్సులా కరువు నేలపై కనిపించే ఆశాకిరణం తుంగభద్ర హై లెవెల్ కెనాల్ (హెచ్చెల్సీ). ఈ కాలువ పరిధిలోని

ఆయకట్టు రైతుల ఆశలు ప్రస్తుతం చిగురిస్తున్నాయి. కర్ణాటకలోని పరివాహక ప్రాంతంలో వర్షాలు బాగా కురుస్తున్నందున తుంగభద్ర రిజర్వాయర్‌లో నీటి ఉధృతి పెరుగుతోంది. దీంతో ఈసారి సకాలంలో నీరు విడుదల చేసే అవకాశముంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో నీరు విడుదల చేయవచ్చునని భావిస్తున్నందున నార్లు పోసుకునేందుకు వారు సమాయత్తమవుతున్నారు.

ప్రాజెక్టు పరిస్థితి..

సుమారు 5 దశాబ్దాల క్రితం తుంగభద్ర ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దీని కింద హెచ్చెల్సీ, ఎల్లెల్సీ కాలువలున్నాయి. హెచ్చెల్సీ పొడవు సుమారు 185 కిలోమీటర్లు. అనంతపురం జిల్లాలో దీని పరిధిలో 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే, రిజర్వాయర్‌లో పూడిక పెరగడం, కాల్వల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ఆధునీకరణ పూర్తి చేయలేకపోవడం వంటి కారణాల వల్ల పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వలేని దుస్థితి ఏర్పడింది.

ఈ ఏడాది టీబీ డ్యాంలో 172 టీఎంసీల నీరు లభ్యం కావచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో జిల్లా వాటా 26 టీఎంసీలుండే అవకాశముంది. వీటి ద్వారా సుమారు లక్ష ఎకరాలకు నీరందవచ్చునని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఖరీఫ్ సాగు పై ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సేద్యాలు చేసుకుని నార్లు పోసుకునేందుకు వారు సమాయత్తమవుతున్నారు.

నిర్వహణాలోపం..

హెచ్చెల్సీ ప్రధాన కాలువ నిర్వహణ సరిగా లేదు. పూడిక పేరుకుపోవడం, గట్లు దెబ్బతినడం, పిచ్చి మొక్కలు పెరిగిపోవడం వంటి కారణాలవల్ల దాని పరిస్థితి అధ్వానంగా మారింది. ఫలితంగా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కాలువ ఆధునీకరణ చేపట్టాలని దశాబ్దం క్రితమే నిర్ణయించారు. కొంతమేర నిధులు కేటాయించి పనులు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తికాలేదు.

గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో కనీస నిర్వహణ కూడా లేకుండా పోయింది. ఫలితంగా కాలువకు పలుచోట్ల గండ్లు పడుతున్నాయి. వైసీపీ హయాంలో ఆధునీకరణ పనుల కోసం 725.8 కోట్లు కేటాయించగా, ఖర్చు చేసింది మాత్రం కేవలం 5.72 కోట్లే. దీన్నిబట్టి కాలువ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వమైనా తగినన్ని నిధులు కేటాయించి ఆధునీకరణ పనులు పూర్తి చేయాల్సిన అవసరముంది.

శరవేగంగా మరమ్మతులు

హెచ్చెల్సీకి ఆగస్టు నుంచి నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో అధికారులు శరవేగంగా మరమ్మత్తు పనులు చేయిస్తున్నారు. బొమ్మన హాళ్ మండలం ఉంతకల్లు సమీపంలో 112వ కిలోమీటర్ వద్ద ఇప్పటికే పనులు పూర్తి చేశారు. అలాగే డీ హీరేహాళ్ మండలం చెర్లోపల్లి సమీపంలో 119.638వ కిలోమీటర్ వద్ద అండర్ టన్నెల్ మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఉరవకొండ మండలం నింబగల్లు సమీపంలో 181.100 వ కిలోమీటర్ వద్ద తెగిపోయిన కాలువ గట్టు పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తమ్మీద ఈ పనులన్నీ నీరు విడుదల చేసేలోపు పూర్తి చేయనున్నారు.


Similar News