గిరిజన యువతిపై అత్యాచారయత్నం
గతంలో కిడ్నాప్ కేసు నమోదు అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పురాలేదు.
దిశ, డైనమిక్ బ్యూరో : గతంలో కిడ్నాప్ కేసు నమోదు అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. ఏ అమ్మాయి కారణంగా తాను పోలీసు కేసును ఎదుర్కోవాల్సి వచ్చిందో అదే అమ్మాయిపై కక్ష పెంచుకున్నాడు. అంతే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతి స్నానం చేస్తుండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం శంకర గిరిజన కాలనీలో జరిగింది. బాధిత యువతి, తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..
శంకర గిరిజన కాలనీకి చెందిన గడ్డం రామకృష్ణయ్యకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా చిన్న కుమార్తె ఇంటి వద్ద ఉంటుంది. రామ కృష్ణయ్య ఆటో నడుపుతుండగా.. భార్య ఒక ప్రైవేటు కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో యువతి స్నానం చేస్తుంది. అదే సమయంలో పునరపివారి పాలెంకు చెందిన వాసు అనే యువకుడు ఇంట్లోకి చొరబడ్డాడు. బాత్ రూం తలుపు పగలగొట్టి లైంగిక దాడికి యత్నించాడు.
అయితే యువతి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కొన్ని నెలల క్రితం ఇదే వాసు ఈ అమ్మాయినే బలవంతంగా తీసుకెళ్లాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై చిల్లకూరు పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు అయ్యిందని అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయారు. నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.