DSC Free coaching:డీఎస్సీ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు
రాబోయే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నేపథ్యంలో అర్హులైన నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్, చిత్తూరు నందు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతోంది.
దిశ ప్రతినిధి,చిత్తూరు: రాబోయే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నేపథ్యంలో అర్హులైన నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్, చిత్తూరు నందు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతోంది. ఈ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుండగా.. ఈ క్రమంలో నవంబర్ 20 తేదీ వరకు పొడిగించారు. ఈ శిక్షణకు టీటీసీ మరియు టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు అని దరఖాస్తుదారుల జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉండాలని, శిక్షణలో సీట్ల కేటాయింపు బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం ఉండగా, అదనంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
రెండు నెలల శిక్షణ కాలంలో 75 శాతం హాజరు ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.1500 స్టైపెండ్ మరియు మెటీరియల్ కోసం రూ.1000 అందజేయ ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు సంబంధిత పత్రాలు (ప్రొవిజినల్ సర్టిఫికెట్, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కుల పట్టాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు) జతచేసి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, అంబేద్కర్ భవన్, కొత్త కలెక్టరేట్, చిత్తూరు, పిన్ కోడ్-517002 చిరునామాకు ఈనెల 20 లోపు సమర్పించవలెను అని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారత అధికారి రబ్బానీ భాష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.