APCC: చంద్రబాబు అర్ధ సంవత్సర పాలన అర్ధ రహితం.. వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్
కూటమి పార్టీల సారథ్యంలోని చంద్రబాబు నాయుడు(CM Chandrababu) అర్ధ సంవత్సర పాలన పూర్తిగా "అర్ధ రహితం" అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు(AP Congress Chief) వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: కూటమి పార్టీల సారథ్యంలోని చంద్రబాబు నాయుడు(CM Chandrababu) అర్ధ సంవత్సర పాలన పూర్తిగా "అర్ధ రహితం" అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు(AP Congress Chief) వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు.కూటమి ప్రభుత్వం(NDA Govt) ఆరు నెలల పాలనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. 6 నెలల్లో ఇచ్చిన 6 సూపర్(Super Six) హామీలకు దిక్కులేదని, మ్యానిఫెస్టోలో పెట్టిన 60 హామీలు పత్తాకు లేవని అన్నారు. మూడు సిలిండర్లలో ఈ ఏడాది సింగిల్ సిలిండర్ తో మమ అనిపించారని, 3 వేల నిరుద్యోగ భృతి ఊసే లేకుండా చేశారని, 20 లక్షల ఉద్యోగాలు అవిగో, ఇవిగో అంటున్నారని, స్కూల్ కి వెళ్ళే ప్రతి బిడ్డకు 15 వేలు ఇస్తామని తల్లులకు పంగనామాలు పెట్టారని విమర్శలు చేశారు. అలాగే రైతుకి 20 వేల సహాయం చేసే పథకం అన్నదాత సుఖీభవను దుఃఖిభవ చేశారని, ప్రతి నెల 1500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఇస్తా మన్నారు.. ఆడబిడ్డ నిధి ఎక్కడో అడ్రెస్ లేదని ఎద్దేవా చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పుడూ అంటే పండుగలు, పబ్బాల పేరు చెప్పి కాలయాపన చేస్తున్నారని, జూన్ 12 న తొలి సంతకం పెట్టిన DSC నోటిఫికేషన్ కే ఇప్పటికీ దిక్కులేదని, ఉచిత ఇసుక పథకంలో ఉచితం ఎక్కడా లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాబు 6 నెల్ల పాలన ఎలా ఉందంటే.. "మండలానికి 3 మద్యం షాపులు.. 30 బెల్టు షాపులు.. అభివృద్ధిలో 3 మాటలు... 30 గ్రాఫిక్స్ డిజైన్లు".. మొదటి 5 ఏళ్లలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే.. ఇప్పుడు మళ్ళీ అదే చేతిలో కైలాసం చూపిస్తున్నారని అన్నారు. బాబు షూరిటి భవిష్యత్ గ్యారెంటీ కాస్త " బాబు షూరిటి.. వడ్డింపులకు గ్యారెంటీ " లా మారిందని, వచ్చిన 6 నెలల్లోనే 17500 కోట్ల రూపాయలు జనం నెత్తిన వేశారని ఆరోపించారు. క్వాలిటీ మద్యం అంటూనే.. ధరలు పెంచి జనాలను పీల్చి పిప్పి చేస్తున్నారని, ఈ ఆర్ధిక భారంపై మా తప్పేం లేదంటూనే జనం నెత్తిన మోపుతున్నారని అన్నారు.
ఇక ఇచ్చిన హామీలు సంగతి ఏంటి అని అడిగితే.. చంద్రబాబు ఇప్పటికీ చెప్తున్న సమాధానం.. రాష్ట్రం వెంటిలేటర్ పై ఉందని, వైసీపీ వాళ్ళు 5 ఏళ్లు అడవి పందుల్లా మేశారని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, గాడిలో పెట్టాలి అంటున్నారని చెప్పారు. నిజమే వైసీపీ 5 ఏళ్ల పాలన దోపిడీ పాలన. దొంగల పాలన. నేల, నీరు, ఖనిజం , ఒకటేంటి.. కన్ను పడిందల్లా కాజేశారని, వాళ్ళు తిన్నారు కాబట్టే.. జనాలు బుద్ధి చెప్పారని, రాష్ట్రాన్ని దివాలా తీయించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారని తెలిపారు. మీరేదో ఉద్దరిస్తారని మీకు పట్టం కడితే మీరు చేసేది ఏంటని, ఈ 5 ఏళ్లు రాష్ట్రాన్ని గాడిలో పెడుతూనే ఉంటారా? ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టరా? అని ప్రశ్నించారు. ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. గత ప్రభుత్వ తప్పిదాలను అడ్డుపెట్టుకుంటూ.. 6 నెలలు కాలయాపన చేశారని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మీ 4.0 ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని అంటూ.. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చూడండి అని షర్మిల రాసుకొచ్చారు.