దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10వ రోజుకు చేరుకున్నాయి. నేడు అసెంబ్లీ కమిటీ హాల్ లో పీఏసీ (ప్రజా పద్దుల కమిటీ) సభ్యత్వాలకు ఓటింగ్ జరగనుంది. టీడీపీ తరపున ఏడుగురు సభ్యులు నామినేషన్లు వేయగా.. బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు నామినేష్ వేశారు. పీఏసీ ఛైర్మన్ (PAC Chairman)గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఎన్నిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ కూడా జరుగుతుంది.
అసెంబ్లీలో పీఏసీ కమిటీలో 9 మంది సభ్యులుంటారు. కూటమి పార్టీలు ఈ 9 మందితో నామినేషన్లు వేయించగా.. వైసీపీ నుంచి ఒక నామినేషన్ రావడంతో ఎన్నికలు నిర్వహించక తప్పడం లేదు. దీంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. టీడీపీ తరఫున పీఏసీ సభ్యత్వానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నామినేషన్‌లు దాఖలు చేశారు.
గత అసెంబ్లీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా.. పయ్యావుల కేశవ్ కు పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఒక్కో పీఏసీ సభ్యత్వానికి 20 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి.. కానీ వైసీపీకి 11 మంది మాత్రమే ఉన్నారు.