Ap Floods: ఏపీ ఎన్జీవోస్ భారీ సాయం.. రూ. 120 కోట్ల ప్రకటన

ఏపీ వరద బాధితులకు ఉద్యోగుల ఎన్జీవోన్ భారీ విరాళం ప్రకటించారు.

Update: 2024-09-04 12:50 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల తీవ్ర నష్టం జరిగింది. ఎడతెరిపి లేకుండా పడిన వానతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పొంగడంతో ఆ వరద నీరు సమీప కృష్ణా జిల్లాలోకి భారీగా ప్రవహించింది. దీంతో కృష్ణా జిల్లా నందిగామ పట్టణ పరిసరాలకు వరద పోటెత్తింది. ఒక్కసారిగా వరద నీరు రావడంతో చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. ఇళ్లు, రోడ్లు నీట మునిగాయి.

మరోవైపు విజయవాడలో బుడమేర వాగు పొంగడంతో సింగ్‌నగర్‌తో పాటు ప్రకాశ్ నగర్, చిట్టి నగర్, మొగల్రాజపురం, రాజరాజేశ్వరి నగర్‌లో 4 నుంచి 5 అడుగుల మేర వరద నీరు చేరింది. ఇళ్లు, రోడ్లపై భారీగా నీరు ఉండటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. లోతట్టు ప్రాంతాలను ముంచేశాయి.

చాలా ప్రాంతాల్లో వరద బాధితులు అర్తనాదాలు చేస్తున్నారు. భోజనం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులు పడుతున్న కష్టాలు చూసి ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ నటులతో పాటు ప్రజలు చలించిపోతున్నారు. ఆర్థిక విరాళాలు ప్రకటించారు. వరద బాధితుల కోసం తాజాగా ఏపీ ఉద్యోగుల ఎన్జీవోస్ భారీ విరాళం ప్రకటించారు. ఒక్క రోజు బేసిక్ పే ద్వారా రూ. 120 కోట్లు సాయం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు రిలీఫ్ ఫండ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. ఆపదకాలంలో ఉన్న వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఏపీ ఎన్జీవోలు పిలుపునిచ్చారు. 


Similar News