చాయ్ బిస్కట్ చల్తా నహి.. సమ్మె బాట పట్టనున్న ఏపీ ఉద్యోగులు
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టేందుకు ఏపీ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : న్యాయమైన డిమాండ్లు, ఆర్థికపరమైన, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు కదం తొక్కేందుకు రెడీ అయ్యారు. ఇప్పటి వరకు ప్రభుత్వంతో సామరస్య పూర్వకంగా చర్చలు జరిపిన ఉద్యోగులు ఇక అమితుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. ఇక తమ నిరసన గళం విప్పాల్సిందేనని డిసైడ్ అయ్యారు. గతంలో సమ్మెకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇచ్చాయి. అయితే సీఎం వైఎస్ జగన్ పలు హామీలు ఇవ్వడంతో అప్పుడు సమ్మెను నిలిపివేశారు. అయితే సీఎం జగన్ ఇచ్చిన హామీలు నేటికి కూడా నెరవేరకపోవడంతో ఇక ఉద్యమ బాట పట్టాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. గతంలో మాదిరిగా మంత్రుల ఉప సంఘంతో చాయ్ బిస్కెట్ సమావేశాలు చెల్లవని తేల్చేశారు. ఇక డిమాండ్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
సీఎస్ కు నోటీసులు అందజేత
ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇప్పటికే తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని పదే పదే హెచ్చరించారు. అయినప్పటికీ తమ డిమాండ్ల సాధన విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని బొప్పరాజు ఆరోపించారు. ఇందులో భాగంగా ఈనెల 26న రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ కార్యచరణకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. యూనియన్ నేతలతో కలిసి ఉద్యమ నోటీసులు ఇచ్చారు. ఉద్యోగుల ఆర్థికపరమైన, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యమం చేపడుతున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు.
వెనక్కి తగ్గేది లేదు
మార్చి 9 నుంచి ఉద్యమ కార్యాచరణ షురూ అవుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. సీఎస్ జవహర్ రెడ్డితో భేటీ అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులంతా తమ డిమాండ్ల సాధనకు ఆందోళన బాటపట్టాలని పిలుపునిచ్చారు. ముందుగా సెల్ డౌన్, పెన్ డౌన్, భోజన విరామ సమయాలలో నిరసన గళం వినిపించాలని సూచించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్లలో స్పందన దరఖాస్తులు ఇవ్వాలని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈసారి చాయ్ బిస్కట్ సమావేశాలతో రాజీపడే ప్రసక్తేలేదని...పోరును ఉధృతం చేస్తామని.. తమ డిమాండ్లు సాధించుకునేందుకు వెనుకాడేది లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.