కర్ణాటక సీఎంతో పవన్ కల్యాణ్ భేటీ.. వన్య ప్రాణి, అటవీ సంరక్షణపై చర్చలు
వన్య ప్రాణి, అటవీ సంరక్షణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. ..
దిశ, వెబ్ డెస్క్: వన్య ప్రాణి, అటవీ సంరక్షణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేను గురువారం ఉదయం కలిశారు. చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయని, ప్రాణ హాని కలిగిస్తున్నాయని, ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమని బి. ఖంద్రేకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక అటవీ శాఖ పరిధిలో ఉన్న కొన్ని కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరారు.
అనంతరం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వంతో వన్య ప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై ఆయనతో చర్చించారు.
ఈ భేటీకంటే ముందు బెంగళూరు చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ సుధీంద్ర, బోర్డు సలహాదారు భరత్ సుబ్రహ్మణ్యం తదితరులు స్వాగతం పలికారు.