శారదా పీఠం నుంచే.. దేవాదాయ శాఖ ప్రక్షాళన

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండచూసుకొని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖను తన ఆధీనంలో తెచ్చుకొని ఐదేళ్లుగా ఏలుతున్న విశాఖ శారదాపీఠం నుంచి టీటీడీని బయట పడేసే చర్యలు ప్రారంభమయ్యాయి.

Update: 2024-06-19 05:58 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండచూసుకొని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖను తన ఆధీనంలో తెచ్చుకొని ఐదేళ్లుగా ఏలుతున్న విశాఖ శారదాపీఠం నుంచి టీటీడీని బయట పడేసే చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ర్ట దేవాదాయ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ మంత్రి, సమర్థుడు, వివాద రహితుడు అయిన ఆనం రామనారాయణరెడ్డి ఆదిశగా చర్యలు ప్రారంభించారు.

వైసీపీ పాలనలో ఇద్దరు మంత్రులు ఆ శాఖకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ వాస్తవంగా ఆ శాఖను శారదాపీఠం స్వామి స్వరూపానందేంద్ర నియంత్రించారు. దేవాదాయ శాఖకు ఎవరు మంత్రి అయినా, ఎవరు కమిషనర్ అయినా తిరుపతి వెంకన్న కంటే ముందుగా స్వరూపనందేంద్ర దర్శనమే చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆ శాఖ మొత్తం ఆయనకు సరెండర్ అయిపోయింది.

పాలన ఇక్కడి నుంచే

దేవాదాయ శాఖలో పలు వివాదాస్పద నిర్ణయాలు, జీవోలకు విశాఖ శారదాపీఠమే వేదిక అయింది. ముఖ్యంగా వివాదాల్లో ఉన్న వందల కోట్ల రూపాయల ఎండోమెంట్ భూములకు సంబంధించిన సెటిల్మెంట్లు స్వామి సమక్షంలో, ఆయన ప్రమేయంతో జరిగాయనే ఆరోపణలున్నాయి. ముఖ్యమైన ఆలయాలకు కార్యనిర్వహణాధికారులుగా పోస్టింగ్‌లు పడాలంటే స్వరూపానందకు భారీగా సమర్పించుకోవాల్సిందే అనేది బలపడింది.స్వరూపానందను కాదని మిగిలిన స్వాములను ఎవరైనా గౌరవించినా, ఆలయాలకు వచ్చినప్పుడు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికితే కూడా స్వరూప ఆగ్రహానికి గురయ్యేవారు.

పీఠంలో, యాగాల్లో ప్రభుత్వ అర్చకులే

వివిధ ఆలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న అర్చకులు శారదాపీఠంలో కూడా అనధికారికంగా పూజలు చేయాలి. లేకుంటే వారిపై లేనిపోని ఆరోపణలతో క్రమశిక్షణా చర్యలు వుంటాయి. స్వామి రాజకీయ నేతల ప్రయోజనాల కోసం వారి నుంచి కోట్ల రూపాయలలో ఫీజు తీసుకొని చేసే యాగాలలోకూడా ప్రభుత్వ అర్చకులు పాల్గొనాల్సిందే. ప్రభుత్వం మారిన తరువాత కూడా విశాఖ కనక మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్నట్లు రికార్డుల్లో వున్న కొందరు ఇప్పటికీ శారదాపీఠంలో సేవలందిస్తున్నారు.

అలయాల్లో హవా

నిజానికి స్వరూపానందేంద్ర ఆధ్యాత్మిక స్వామి కాదు, రాజకీయ స్వామి, పైరవీలు, సెటిల్మెంట్ల స్వామి. ఆయన పీఠానికి ఆధ్యాత్మిక లోకంలో గుర్తింపే లేదు. వారసత్వంగా సంక్రమించిందీ కాదు. దీంతో పీఠానికి అనుబంధంగా ఆలయాలేమీ లేవు. అసలు పీఠాధిపతి అంటే పూరత్ సన్యాశాశ్రమంలో వుండి నిత్యం అనుస్టానంతో ఆధ్యాత్మిక వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి మంచి చేస్తూ ధర్మ పాలనలో భాగస్వామలు కావాలి.

ఇవేమీ లేకపోవడం వల్ల స్వరూపానంద ఏ ఆలయానికి శాస్ర్తం ప్రకారం, వారసత్వం ప్రకారం ఆలయ ధర్మాలు తెలియజేసే గురువు కాదు. అయినప్పటికీ స్వరూపానంద, ఆయన శిష్యుడు స్వాత్మానంద రాష్ర్టంలో ఏ ఆలయానికి వెళ్లినా పూర్ణకుంభంతో స్వాగతం పలలకాలనే షరతు విధించి అమలు చేయించారు.

వందల కోట్ల స్ధలాలు..

స్వామి జగన్ ప్రభుత్వంలో ఆడిందే ఆట కావడంతో రూ.300 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని విశాఖలో కేటాయింపజేసుకొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయింపుల కోసం పైరవీలు చేసినప్పటికీ నిజాయితీ పరుడైన ఎండోమెండ్ కమిషనర్ జే ఎస్ వీ ప్రసాద్ పడనివ్వలేదు. శారదాపీఠం నిజమైన పీఠం కాదని, ఇక్కడ ఆధ్మాత్మిక కార్యక్రమాలు పెద్దగా లేవని నిరాకరించి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు.

జగన్ ప్రభుత్వంలో ఆయన మాటకు ఎదురే లేకపోవడంతో భీమిలి మండలంలో భూములు కేటాయించి రూ.15 కోట్ల వుడా నిధులతో రహదారులు కూడా వేశారు. తీరా అంతా చేశాక ఇక వైసీపీ ప్రభుత్వం రాదని ముందే గ్రహించిన స్వరూప ఆ స్థలంలో వేద విద్య గాక, కమర్షియల్ కార్యక్రమాలకు అనుమతివ్వాల్సిందిగా దరఖాస్తు చేసి వత్తిడి తీసుకువచ్చారు. దీంతో పాటు పెందుర్తి పీఠంలో కూడా ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది.

వీటన్నింటిపై కొత్త మంత్రి రామనారాయణ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సింది. స్వరూపానంద, స్వాత్మానందలు దేవాదాయ శాఖలో శాశ్వతంగా జోక్యం చేసుకోని విధంగా చర్యలు తీసుకొవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని తెలిసింది.

Also Read: 18వ లోక్ సభ: బీజేపీ నెంబర్ 1, టీడీపీ నెంబర్ 6, వైసీపీ 15వ స్థానం


Similar News