రేపు సాయంత్రానికి తుంగభద్రకు ప్రత్యామ్నాయ గేట్లు: మంత్రి పయ్యావుల
కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఇటీవల తుంగభద్ర డ్యామ్ లోని 19వ గేట్ కొట్టుకు పోయింది.
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఇటీవల తుంగభద్ర డ్యామ్ లోని 19వ గేట్ కొట్టుకు పోయింది. దీంతో అధికారులు ఎమర్జెన్సీ ద్వారా అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే డ్యాం నుంచి లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా వెళ్తుండటంతో అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ అధికారులు సమీక్ష నిర్వహించి తాత్కలిక గేట్ ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. కాగా దీనికి సంబంధించిన పని ఇప్పటికే పూర్తవ్వగా కొత్తగా తయారు చేస్తున్న ప్రత్యామ్నాయ గేట్లను గురువారం రోజు పూజ చేసి అమర్చనున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ రోజు సాయంత్రానికి ప్రత్యామ్నాయ గేట్లు తుంగభద్రకు చేరుకుంటాయని.. రేపు పూజా కార్యక్రమాల తర్వాత గేట్ల ఏర్పాటు జరుగుతుందని.. గత ప్రభుత్వం గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని, మేం వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు కనుగొన్నామని, వరద ఉధృతి అధికంగా ఉన్న సమయంలో గేట్లు ఏర్పాటు చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని అని.. కానీ నీరు వృధాగా వెళ్లకూడదనే నిర్ణయంతోనే సాహసోపేత కార్యక్రమం చేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు.