Lokesh Nara: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి నారా లోకేశ్ కీలక సూచనలు
దిశ, డైనమిక్ బ్యూరో: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వాళ ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష బీభత్సంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్ల పైకి చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నందున ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి, పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ క్రమంలోనే భారీ వర్షాలపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ప్రజలకు కీలక సూచనలు చేశారు. అంతేగాక టీడీపి కార్యకర్తలు, నేతలకు కూడా మెసేజ్ ఇచ్చారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ అలెర్ట్ మెసేజ్‌లు గమనిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు బయటకు రాకుండా ఉండటమే మంచిదని, కొండ చరియలు విరిగిపడే, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికార యంత్రాంగం సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, టీడీపి నేతలు, కార్యకర్తలు సహాయక చర్యలకు తమ పూర్తి సహకారం అందించాలని సూచించారు. విపత్తుల కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని నారా లోకేశ్ ఎక్స్ లో రాసుకొచ్చారు.