అన్ని పార్టీలు వారి కనుసన్నల్లోనే.. స్టేట్‌లో బీజేపీయే కింగ్​ మేకర్​..!

రాష్ట్రంలోని ప్రధాన పక్షాలను కేంద్రంలోని బీజేపీ పెద్దలు తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు.

Update: 2023-04-29 02:29 GMT

రాష్ట్రంలోని ప్రధాన పక్షాలను కేంద్రంలోని బీజేపీ పెద్దలు తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి పోలైన ఓట్ల సంఖ్య నోటా కంటే తక్కువే. కానీ, ఇక్కడ ఏ పార్టీ అధికారానికి రావాలనేది బీజేపీ అగ్రనేతలు నిర్ణయించడం మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోంది. జగన్ పేరుకే సీఎం​. ఓరకంగా చెప్పుకోవాలంటే పాలనంతా బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తోంది. నిన్న మొన్నటి దాకా కేంద్రంపై చంద్రబాబు మౌనం వహించారు. ఇప్పుడు ఆయన సైతం మోడీ విధానాలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ రెండు నాల్కల ధోరణితో వైసీపీలోని ముస్లిం నేతలు ఆందోళన చెందుతున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: ఈ దఫా ఎన్నికల్లో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకోవాలి.. ఏ పార్టీ గెలవాలనే దానిపై కేంద్రంలోని బీజేపీ నేతలు చక్రం తిప్పుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పేరెత్తితేనే జనం భగ్గుమంటున్నారు. పెట్రోలు, డీజిల్​, వంట గ్యాస్​ ధరల పెంపుపై మండిపడుతున్నారు. నిత్యావసరాలపై జీఎస్టీ భారం మోపడంతో భరించలేకపోతున్నారు. అర్బన్​ సంస్కరణల్లో భాగంగా ఆస్తి, ఇంటి పన్నుల పెంపును నిరసిస్తున్నారు. చివరకు తాగు నీటికీ మీటర్లు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్​ అమ్మకంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉడికిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా కొర్రీలు వేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. విభజన హామీలు ఒక్కటీ నెరవేర్చని బీజేపీ... రాష్ట్రంలోని ప్రధాన పార్టీలను సర్కస్​ ఫీట్లు చేయించడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నారు.

బీజేపీకి సాగిలపడుతున్న ప్రధాన పక్షాలు..

అధికార వైసీపీ బీజేపీకి అనుకూలం కాదన్నట్లు రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చే కార్యక్రమాన్ని బీజేపీ నేతలు భుజానికెత్తుకున్నారు. బీజేపీ, వైసీపీ ఒకటి కాదనే సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా కేంద్రం ధరలు పెంచితే తమకేం సంబంధం అన్నట్లు చెబుతోంది. ఎక్కడైనా ధరలపై ప్రజలు నిలదీస్తే పెట్రోలు, డీజిల్​, గ్యాస్​, జీఎస్టీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండవు కదా అంటూ తెలివిగా సమాధానం ఇస్తోంది. మరోవైపు కేంద్ర సర్కారు నిర్ణయాలకు వైసీపీ వత్తాసు పలుకుతూనే ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం కేంద్రం నిర్ణయాలను అమలు చేయడానికి వెనకాడుతున్నా ఇక్కడ మాత్రం వైసీపీ సర్కారు జీ హుజూర్​ అంటోంది. రాజ్యసభలో కేంద్రం ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకూ వైసీపీ, టీడీపీ ఎంపీలు బేషరతుగా మద్దతు ఇస్తున్నారు.

బీజేపీ, వైసీపీ చెలిమి బహిరంగ రహస్యమే..

రాష్ట్రంలోని విద్యుత్​ ప్రాజెక్టులు, పోర్టులను అదానీకి కట్టబెట్టడం వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందన్న సంగతి జగమెరిగిన సత్యం. జెన్​కో థర్మల్​ విద్యుత్​ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును విదేశాల్లో అదానీకి చెందిన కోల్​ మైన్స్​ నుంచి అధిక ధరలకు కొనడం వెనుకా కేంద్ర సర్కారు ఆదేశాలున్నాయి. కేంద్రం నిర్ణయాల మేరకే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారు. ప్రజల నెత్తిన స్మార్టు మీటర్ల భారం మోపుతున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్​ సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం తు.చ. తప్పకుండా అమలు చేస్తోంది. దీంతో వైసీపీ, బీజేపీ బంధం గురించి ప్రజలకు తెలిసిపోయింది.

రగులుతున్న ముస్లింలు...

తెలంగాణలో గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని అమిత్​ షా ప్రకటించారు. కర్నాటకలో ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని చెబుతున్నారు. ఇలా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న బీజేపీతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అంటకాగడాన్ని ముస్లింలు తట్టుకోలేకపోతున్నారు. ముస్లింల జోలికొస్తే పోరాడతానన్న జనసేనాని మౌనం వహించడంపై ఆందోళన చెందుతున్నారు. చివరకు టీడీపీ కూడా బీజేపీకి సాగిలపడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్ర సర్కారు విధానాలు, బీజేపీ పోకడలపై క్షేత్ర స్థాయిలో ప్రజలు నిలదీస్తే ఏం చెప్పాలో అర్థం కావడం లేదని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే...

ప్రధాన మూడు పార్టీలు బీజేపీ ఉపాంగాలుగా మారిపోవడాన్ని కాంగ్రెస్​, వామపక్షాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్​కే విజయావకాశాలున్నట్లు తెలుస్తోంది. అక్కడ గెలిస్తే ఇక్కడ కాంగ్రెస్​తో వామపక్షాల కూటమి ఏర్పడే అవకాశాలున్నాయి. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్​ఎస్​తో వామపక్షాలకు పొత్తు కుదిరితే ఇక్కడ కూడా కలుపుకుపోయే చాన్స్​ ఉంది. రాష్ట్రంలో బీజేపీ గూటి కిందకు చేరిన మూడు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్​, వామపక్షాలు ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News