అచ్యుతాపురం రియాక్టర్ ప్రమాదం.. 18కి చేరిన మృతుల సంఖ్య
ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 18 కి చేరింది.
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 18 కి చేరింది. గాయపడ్డ వారిలో మరింత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు, మృతుల సంఖ్య ఇంకా ఉండే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఎసెన్సియా ఫార్మా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో అక్కడిక్కడే ఏడుగురు కార్మికులు మృతి చెందగా, మరో 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా పేలుడు ధాటికి కార్మికులు ఎగిరి పడటంతో వారి దేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. ప్రమాదం జరిగినపుడు కంపెనీలో దాదాపు 300 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నట్టు సమాచారం. పేలుడు తీవ్రతకు భవనం కుప్పకూలి భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. 11 ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను భారీ క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగించి బయటకు తీసింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. కాగా క్షతగాత్రులను అవసరమైతే విశాఖకు, హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించి వైద్యం అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రేపు అచ్యుతాపురం ఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రమాద బాధితులను చంద్రబాబు నాయుడు కలవనున్నారు.